గురూ..! చెయ్యి పప్పుచారూ..!
‘పప్పుచారు అంటే నాకు చాలా ఇష్టం’ అని చెప్పడం తేలిక.
‘చేయడం మాత్రం చాలా కష్టం’ కానే కాదు.
కావలసినవి:
కాస్త ఆత్మవిశ్వాసం. వినడానికి పాత పాటలు కొన్ని. కందిపప్పు: తగినంత ఉల్లిపాయ: ఒకటి ఎండు మిర్చి: రెండు టొమాటో: ఒకటి పచ్చిమిర్చి: రెండు వెల్లుల్లి: మూడు రేకలు ఉప్పు: తగినంత నూనె: రెండు టేబుల్ స్పూన్లు కారం: ఒక టీ స్పూను ఇంకా కరివేపాకు, తాలింపు దినులు.
ఇప్పుడు ఇలా చేయండి: ఆడుతు పాడుతు పని చేస్తుంటే... పాట ప్లే చేయండి. పప్పుని కుక్కర్లో ఉడకబెట్టండి. చింతపండుని ఒక పాత్రలో నాన పెట్టండి. ఒక గిన్నెలో నూనె పోసి స్టవ్ మీద పెట్టండి. నూనె కాస్త కాగిన తరువాత ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు అందులో వేయండి. ఆ తరువాత రెండు గ్లాసుల నీళ్లు పోయండి చింతపండు నీళ్లని పప్పులో వేసి బాగా కలపాలి. వేగిన ఉల్లిపాయ, టొమాటో ముక్కలను దీనిలో కలపండి తగినంత ఉప్పు, కారం వేసి కలిపి స్టవ్ మీద పెట్టండి. మరోవైపు ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు... మొదలైన వాటితో తాలింపు పెట్టి, దాన్ని ఉడుకుతున్న పప్పులో కలపండి. పప్పుచారు తయారు!