మైనారిటీలకు ‘మణిదీపం’ వైఎస్సార్ సీపీ
వైఎస్‌లాగే ముస్లింలకు అండగా జగన్
మాజీ మంత్రి పెద్దిరెడ్డి
మదనపల్లె, న్యూస్‌లైన్: మైనారిటీలకు మణిదీపం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అని మాజీమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. శనివారం స్థానిక ప్యారడైజ్ ఫంక్షన్ హాల్లో మైనారిటీ నాయకులు మెట్రోబాబ్జాన్, 30 వ కౌన్సిలర్ వార్డు అభ్యర్థి మహ్మద్ రఫీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మైనారిటీల ఆత్మీయ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చీకట్లో మగ్గుతున్న ముస్లిం మైనారిటీలకు దివంగత మాహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి నాలుగుశాతం రిజర్వేషన్ కల్పించి ఉజ్వల భవిష్యత్తుకు దారిచూపారన్నారు. మతతత్వ బీజేపీని రాష్ట్రం నుంచి తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. 2002లో నరేంద్రమోడీ గుజరాత్ రాష్ట్రంలో ముస్లింలను ఊచకోత కోశారన్నారు. మోడీ తొలినుంచీ ముస్లింల వ్యతిరేకి అన్నారు.
ఇదే బీజేపీ ముస్లింలకు రిజర్వేషన్ పెంచకూడదని సుప్రీంకోర్టును ఆశ్రయించడం తగదన్నారు. వైఎస్‌లాగే జగన్మోహన్రెడ్డి కూడా ముస్లిం మైనారిటీలకు అండగా ఉండి అనేక సంక్షేమ పథకాలు అమలు చేయడం ఖాయమన్నారు. మదనపల్లెలో మతతత్వ బీజేపీతో కలిసి టీడీపీ ఉమ్మడి అభ్యర్థిని ప్రకటించడం సిగ్గుగా ఉందన్నారు. ఎప్పుడూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముస్లిం మైనారిటీలకు అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు.
మైనారిటీలను ఓటు అడిగే హక్కు ఒక్క వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకే వుందన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్‌పార్టీ అధికారంలోకి వచ్చిన మరుక్షణం పట్టణంలోని కోట్లాది రూపాయలు విలువ చేసే వక్ఫ్ బోర్డు ఆస్తులు ఒక్క సెంటు కూడా అన్యాక్రాంతం కాకుండా కాపాడుతామన్నారు. గత దశాబ్దకాలంగా పెండింగ్‌లో ఉన్న షాదీమహల్ నిర్మాణానికి రూ.40 లక్షలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ దేశాయ్‌తిప్పారెడ్డి మాట్లాడుతూ నీతి నిజాయితీలతో పారదర్శకంగా పనిచేసే ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్‌పార్టీ అన్నారు.
మదనపల్లెలో తన ఆస్తులకన్నా ముస్లిం ఆస్తుల పరిరక్షణకు అధిక ప్రాధాన్యత కల్పిస్తానన్నారు. కులమతాలకు అతీతంగా సేవచేస్తానని హామీ ఇచ్చారు. వైఎస్ఆర్ ఆశయాలను నెరవేర్చేందుకు జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారన్నారు. మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి షమీం అస్లాం మాట్లాడుతూ ఎమ్మెల్యేగా ఐదేళ్లు పనిచేసిన షాజహాన్‌బాషా షాదీమహల్‌ను పూర్తిచేయడంలో విఫలమయ్యారని, మైనారిటీలకు ఎలాంటి మేలు చేయలేదని ఆరోపించారు.
సమావేశంలో మైనారిటీ సీనియర్ నాయకులు బాబ్జాన్, నాయకులు ఎన్.బాబు, మాజీ మున్సిపల్ వైఎస్ చైర్మన్ ఇర్ఫాన్‌ఖాన్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్లు అడివిలోపల్లె గోపాల్‌రెడ్డి, పాల్ బాలాజీ, మస్తాన్‌ఖాన్, అహ్మద్, దావూద్, రఫీ, బుల్లెట్ షఫీ, ఖాజా, ఫిర్దోస్ ఖాన్, న్యాయవాది యహసానుల్లా, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు ఉదయ్‌కుమార్, కార్యదర్శి ఎస్ఎ కరీముల్లా, జింకా వెంకటాచలపతి, హర్ష వర్ధన్‌రెడ్డి, సురేంద్ర, కోటూరి ఈశ్వర్, అధిక సంఖ్యలో మైనారిటీలు, మత పెద్దలు పాల్గొన్నారు. అనంతరం ముస్లిం మైనారిటీలు పెద్దిరెడ్డి, తిప్పారెడ్డిలను ఘనంగా సన్మానించారు.