పారాలింపిక్స్‌లో ఇరాన్ సైక్లిస్ట్ దుర్మరణం
రియో డి జనీరో: పారాలింపిక్స్ పోటీల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. పురుషుల రోడ్ రేస్ సీ4-5 ఈవెంట్లో పాల్గొన్న ఇరాన్ సైక్లిస్ట్ సర్ఫరాజ్ బహమాన్ గోల్బర్నెజాద్ ప్రమాదవశాత్తూ మృతి చెందాడు. శనివారం జరిగిన ఈ ఈవెంట్లో 48 ఏళ్ల సర్ఫరాజ్ రేసు మధ్యలో సైకిల్ నుంచి కిందపడిపోయాడు. వెంటనే అతడిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే ప్రాణాలు వదిలాడు. అయితే ఆస్పత్రికి చేరేలోపే తనకు గుండెపోటు వచ్చిందని అంతర్జాతీయ పారాలింపిక్స్ కమిటీ (ఐపీసీ) అధికారులు వివరణ ఇచ్చారు.
‘ఇది నిజంగా మాకు దిగ్భ్రాంతికర వార్త. 56 ఏళ్ల పారాలింపిక్స్ చరిత్రలో ఇలా ఎప్పుడూ జరగలేదు. సర్ఫరాజ్ కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాం’ అని ఐపీసీ అధ్యక్షుడు ఫిలిప్ క్రావెన్ అన్నారు. 1980లో జరిగిన యుద్ధంలో సర్ఫరాజ్ తన కాలును కోల్పోయాడు. 2002 నుంచి సైక్లింగ్‌ను కెరీర్‌గా మలుచుకుని లండన్ గేమ్స్‌లోనూ పాల్గొన్నాడు. అటు ఇరాన్ పారాలింపిక్ కమిటీ కూడా అతడి అంకితభావాన్ని కొనియాడింది. అథ్లెట్ మృతికి సంతాపసూచకంగా క్రీడా గ్రామంలో ఇరాన్ జాతీయ పతాకాన్ని అవనతం చేశారు. ముగింపు వేడుకల్లోనూ మౌనం పాటించనున్నారు.