మనోధైర్యం నింపేందుకే పరామర్శ యాత్ర
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివకుమార్ వెల్లడి
యాదగిరిగుట్ట: వైఎస్ మరణం తట్టుకోలేక మృతిచెందిన వారి కుటుంబాల్లో మనోధైర్యం నింపేందుకే తమ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల పరామర్శయాత్ర చేపడుతున్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.శివకుమార్ తెలిపారు. ఈ నెల 9వ తేదీ నుంచి నల్లగొండ జిల్లాలో చేపట్టనున్న పరామర్శ యాత్ర పోస్టర్లను శుక్రవారం యాదగిరిగుట్టలో ఆవిష్కరించారు.
అనంతరం శివకుమార్ మాట్లాడుతూ.. దివంగత సీఎం వైఎస్సార్ మృతిని తట్టుకోలేక ప్రాణాలు విడిచిన అనేకమంది కుటుంబాలను పరామర్శిస్తామని గతంలోనే తమ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి ప్రకటించారని గుర్తు చేశారు. ఈ మేరకు మృతుల కుటుంబాలను పరామర్శించి, వారిలో మనోధైర్యం నింపేందుకు షర్మిల ఈ యాత్రను చేపడుతున్నారని పేర్కొన్నారు.
యాదగిరిగుట్ట మండలం దాతర్‌పల్లిలో సుంచు చంద్రమ్మ కుటుంబాన్ని, యాదగిరిపల్లిలో చింతల కృష్ణ కుటుంబాన్ని, ఆలేరులోని ఏదుల శ్రీనివాస్ కుటుంబాన్ని షర్మిల పరామర్శించనున్నారని తెలిపారు. కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శి నిరంజన్‌రెడ్డి, స్టేట్ ప్రోగ్రామ్స్ కోఆర్డినేటర్ సిద్ధార్థ్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు అయిల వెంకన్న తదితరులు పాల్గొన్నారు.