నర్సులు రోగులను ప్రేమతో చూడాలి
వేలూరు, న్యూస్‌లైన్: నర్సింగ్ పూర్తి చేసిన విద్యార్థులు రోగుల పట్ల ప్రేమగా నడుచుకొని సేవా భావంతో వైద్యం అందించాలని చెన్నైలోని ఇంగ్లాండ్ ఉపదూత పరట్ జోషి తెలిపారు. వేలూరు సీఎంసీ మెడికల్ కళాశాలలో ఎమ్ఎస్సీ, బీఎస్సీ, డిప్లొమా నర్సింగ్ కోర్సు లు పూర్తి చేసిన విద్యార్థులకు స్నాతకోత్సవ కార్యక్రమం సీఎంసీ ఆస్పత్రి డెరైక్టర్ సునీల్ చాండీ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి పరట్ జోషి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఆస్పత్రికి వచ్చే వారందరూ అనేక రోగాలతో ఇబ్బందులు పడుతుం టారని, వారి పట్ల దురుసుగా ప్రవర్తించకుండా ప్రేమగా వైద్యం చేయాలన్నారు. రోగుల పట్ల ప్రేమగా మాట్లాడటంతోనే వారికి సగం రోగం నయమవుతుం దన్నారు.
ఇప్పటికే సీఎంసీ ఆస్పత్రి ప్రపంచ స్థాయిలో మంచి గుర్తింపు సాధించిందని అలాంటి ఆస్పత్రిలో పనిచేసే విద్యార్థినులు అదృష్టవంతులని చెప్పారు. అనంతరం కళాశాలలో అన్ని పాఠ్యాంశాల్లో మొదటి స్థానం సాధించిన మరినీ హౌన్‌సిక్‌కు రెండు బంగారు పథకాలను అందజేశారు. ఎంఎస్సీలో మొదటి స్థానం లో నిలిచిన విద్యార్థులు పింజు షాకోజానుకు, జర్నీల్లిన్ బ్యూలాకు బంగారు పథకాలను అందజేశారు. వివిధ కోర్సులు పూర్తి చేసిన 232 మంది విద్యార్థులకు డిగ్రీ పట్టాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ రోస్లీన్ పాల్గొన్నారు.