పుట్టింటికే కన్నం..
- కన్నవారింట బంగారం కొట్టేసిన వివాహిత
- నగలు అమ్ముతుండగా పట్టుకున్న పోలీసులు
హైదరాబాద్: ప్రేమ వివాహం చేసుకుని సుదూరాలకు వెళ్లిపోయింది. భర్తతో గొడవపడ్డానంటూ పుట్టింటికి చేరింది. అదను చూసి ఇంట్లో నగానట్రా కాజేసీ అమ్ముకునే ప్రయత్నం చేసింది. పోలీసుల రంగప్రవేశంతో కటకటాలపాలైంది. హైదరాబాద్లో పుట్టింటికే కన్నం వేసిన సంఘటనలో 28 ఏళ్ల వివాహితను నారాయణగూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం..
హిమాయత్ నగర్, 13వ నంబంర్ వీధిలో షేక్ అఫ్జల్, మహబూబీ(55) దంపతులు నివసిస్తున్నారు. వీరి కుమార్తె షౌఖతున్నీసా ఆలియాస్ మునావర్.. కొద్దికాలం సత్యనారాయణ అనే వ్యక్తిని మతాంతర వివాహం చేసుకుంది. రేవతిగా పేరు మార్చుకుని చెన్నైలో నివసిస్తోంది. ఇటీవలే హిమాయత్ నగర్ లోని పుట్టింటికి చేరుకున్న ఆమె.. భర్తతో గొడవపడి వచ్చానని తల్లిదండ్రులకు చెప్పింది. ఇలా ఉండగా రెండు రోజుల కిందట ఆ ఇంట్లో బంగారం, వెండి నగలు మాయమయ్యాయి.
సొమ్ములు పోయిన విషయాన్ని గుర్తించిన అప్జల్, మహబూబీ దంపతులు నారాయణగూడా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదుచేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు షౌఖతున్నీసా ఆలియాస్ రేవతి తీరుపై అనుమానం వచ్చి ఆమెపై నిఘా పెట్టారు. దొంగిలించిన ఆభరణాలను ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని ఓ దుకానంలో అమ్ముతుండగా రేవతిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు పోలీసులు. ఆమె నుంచి 67 తులాల బంగారు నగలు, 40 తులాల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. కూతురి చర్యతో తల్లిదండ్రులు కుమిలిపోయారు.