పరిగి జీపీని సందర్శించిన డీఎల్పీఓ
గ్రామ పంచాయతీలో రికార్డుల పరిశీలన
పరిగి: గ్రామ పంచాయతీల్లో రికార్డులు సక్రమంగా నిర్వహించాలని చేవెళ్ల డీఎల్పీఓ రాణిబాయి అన్నారు. శుక్రవారం ఆమె పరిగి గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని సందర్శించారు. ఇందులో భాగంగా పలు రికార్డులను తనిఖీ చేశారు. గతంలో వార్డు సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణకు వచ్చానని ఆమె తెలిపారు. పలు అంశాల్లో ఆమె సర్పంచ్ విజయమాలతో చర్చించారు. అయితే ఈ విషయంలో ఇప్పటికే పూడూరు మండల ఈఓపీఆర్డీ విచారణ జరిపి నివేదిక సమర్పించినందున అదే విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేస్తామన్నారు. పంచాయతీల్లో ఇళ్ల నిర్మాణాలకు అనుమతులు నిలిచిపోయిన విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. ఈ విషయాన్ని ప్రజల విన్నపాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తానని తెలిపారు. అయితే ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో పంచాయతీ సర్పంచ్లు, కార్యదర్శులు, ప్రధానంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.