పెరిగిన ఎంపీటీసీ స్థానాలు
జిల్లా పరిషత్, న్యూస్‌లైన్ : జిల్లాలో ప్రాదేశిక నియోజకవర్గాల పునర్విభజన కసరత్తు ముగిసింది. ఎంపీటీసీ స్థానాల తుది జాబితాను జిల్లా, మండల పరిషత్ అధికారులు మంగళవారం విడుదల చేశారు. 2011 జనాభా లెక్కల ప్రకారం కొత్తగా 52 ఎంపీటీసీ స్థానాలు పెరిగాయి. 2001 జనాభా లెక్కల ప్రకారం గతంలో జిల్లాలో 802 ప్రాదేశిక నియోజకవర్గాలు ఉన్నాయి. కొత్తగా ఏర్పడిన ఐదు నగర పంచాయతీలతో 37 ఎంపీటీసీ స్థానాలు కనుమరుగై వాటి సంఖ్య 765కు చేరింది. కొత్త జనాభా లెక్కల ఆధారంగా చేపట్టిన నియోజకవర్గాల పునర్విభజనతో ప్రస్తుతం జిల్లాలో 817 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. ఒక్కో నియోజకవర్గంలో మూడు వేల నుంచి నాలుగు వేల లోపు జనాభా ఉండే విధంగా నియోజకవర్గాలను విభజించారు.
మండల జనాభాను 3500తో భాగించి వచ్చిన సంఖ్యకు అనుగుణంగా ప్రాదేశిక నియోజకవర్గాలను ఏర్పాటు చేశారు. ఈ పునర్విభజనపై జిల్లావ్యాప్తంగా 42 అభ్యంతరాలు రాగా, ఆమోదయోగ్యంగా ఉన్న 14 అభ్యంతరాలను పరిష్కరించి, 28 అభ్యంతరాలను తిరస్కరించారు. మంగళవారం విడుదల చేసిన తుది జాబితా ప్రకారం జిల్లాలో 21 మండలాల్లోని ఎంపీటీసీ స్థానాల సంఖ్యలో ఎలాంటి మార్పు జరగలేదు. తిమ్మాపూర్ మండలంలో ఒక ఎంపీటీసీ స్థానం తగ్గగా.. మిగిలిన 35 మండలాల్లో స్థానాల సంఖ్య పెరిగింది. జిల్లా పరిషత్ అధికారులు ఈ జాబితాను బుధవారం పంచాయతీరాజ్ శాఖకు పంపించనున్నారు.