మాట నిలబెట్టుకుంటే రాజీనామా చేస్తారా?
ఆత్మకూరు : రైతులకు ఇచ్చిన హామీ మేరకు ఆగస్టు లోపు పేరూరు డ్యాంకు హంద్రీనీవా నీటిని మంత్రి పరిటాల సునీతఅందివ్వలేకపోయారని, అయితే ప్రస్తుతమున్న ఖర్చులకు అనుగుణంగా రూ. 10 కోట్ల వ్యయంతో పేరూరు డ్యాంకు హంద్రీనీవా జలాలను తాను తీసుకెళతానని, ఇది వాస్తవ రూపం దాలిస్తే మంత్రి పదవికి సునీత రాజీనామా చేయగలరా అంటూ వైఎస్ఆర్ సీపీ రాప్తాడు నియోజకవర్గం సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి సవాల్ విసిరారు. పేరూరు డ్యాంకు హంద్రీనీవా జలాలను చేర్చడంపై ఆదివారం ఆత్మకూరులో ఆయన రైతులకు అవగాహన కల్పించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... టీడీపీ అధికారంలోకి వస్తే ఏడాది లోపు హంద్రీనీవా ప్రాజెక్ట్ పూర్తి చేసి పేరూరు డ్యాంకు నీళ్లు ఇస్తామంటూ 2012లో ప్రజలకు చంద్రబాబు హామీనిచ్చారని గుర్తు చేశారు.
అధికారం చేపట్టి దాదాపు రెండున్నర సంవత్సరాలు కావస్తున్నా ఇచ్చిన హామీని చంద్రబాబుతో సహా జిల్లా మంత్రి సునీత నెరవేర్చలేకపోయారని ఎద్దేవా చేశారు. రూ. 10 కోట్లతో పూర్తి అయ్యే పనికి రూ. 850 కోట్లు మంజూరు చేయించుకుని అభివృద్ధి్ద పేరుతో ప్రజాధనాన్ని కొల్లగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. వాస్తవానికి పేరూరు డ్యాంకు నీళ్లు అందించాలన్న ఆశయంతో 2008లో స్వయంగా తానే పది రోజుల పాటు సర్వే చేయించి అంచనాలు రూపొందించానని, ఈ మేరకు అప్పట్లో రూ. 85 కోట్లతో పనులు పూర్తి అయివుండేవని గుర్తు చేశారు.
తాను రూపొందించిన ప్లాన్ ప్రకారం అక్కంపల్లి, బోరంపల్లి వద్ద ఉన్న లిఫ్ట్‌లను ఉపయోగిం చుకుంటూ కంబదూరు మండలం ఐపార్స్పల్లికి నీరు తీసుకెళ్లవచ్చు అక్కడ ఓ లిఫ్ట్ ఏర్పాటుచేయడం ద్వారా పేరూరు డ్యాంకు నీటిని చేర్చవచ్చు. పేరూరు ప్రధాన డిస్ట్రిబ్యూటర్ నుంచి ఆత్మకూరు వరకు పొడగించి రూ. 40 కోట్ల వ్యయంతో ఆత్మకూరు మండలంలోని హంద్రీనీవా ఎగువ గ్రామాల్లోని 12 వేల ఎకరాలను సాగులోకి తీసుకురావచ్చునని తెలిపారు. గొల్లపల్లి రిజర్వాయర్ నుంచి పంపింగ్ చేయు దినాలను పెంచడం ద్వారా ఇది సాధ్యమవుతుందని వివరించారు.