కక్షలను ప్రేరేపిస్తున్న పరిటాల వర్గం
కనగానపల్లి: వర్గ విభేదాలతో ఫ్యాక్షన్ కక్షలను ప్రేరేపించేందుకు పరిటాల వర్గం ప్రయత్నిస్తోందని వైఎస్ఆర్సీపీ రాప్తాడు నియోజకవర్గ సమన్వకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి విమర్శించారు. శుక్రవారం అనంతపురంలోని తన స్వగృహంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్లలో తన సొంత రాప్తాడు నియోజకవర్గం అభివృద్ధికి మంత్రి పరిటాల సునీత ఎలాంటి కృషి చేయలేదని అన్నారు. ఆగస్టు నాటికి హంద్రీనీవా జలాలను ఈ ప్రాంతంలోని 1,160 చెరువులకు అందిస్తామంటూ హామీలు గుప్పించిన మంత్రి... తన మాట నిలబెట్టుకోవడంలో విఫలమయ్యారన్నారు.
ఈ విషయం పక్కదారి పట్టించేందుకు మంత్రి తనయుడు శ్రీరాం, అనుచరులు పథకం ప్రకారం నియోజకవర్గం లో వైఎస్ఆర్ విగ్రహాలను ధ్వంసం చేయిస్తున్నారని మండిపడ్డారు. రామగిరి మండలం మాదిరి గానే నియోజకవర్గాన్ని మొత్తం సమస్యాత్మక ప్రాంతంగా మార్చి తమ పబ్బం గడుపుకునేందుకు పథకం వేశారని ఆరోపించారు. అధికార టీడీపీ వైఫల్యాలపై ప్రజలు చైతన్యవంతులై ఎక్కడికక్కడ నిలుదీస్తుంటే సహించలేక ప్రజా ఉద్యమాలను అణిచివేసేందుకు పోలీసులను ఉపయోగిస్తున్నారని, ఇందుకు ధర్మవరం డివిజన్లోని పోలీస్ అధికారులు అండగా నిలవడం శోచనీయమని అన్నారు. పరిటాల వర్గీయుల దురాగతాలకు చెక్ పెట్టేందుకు రాప్తాడు నియోజకవర్గ ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.