పార్క్ స్ట్రీట్ అత్యాచార బాధితురాలి మృతి
ముంబై: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన (పార్క్ స్ట్రీట్ రేప్) సామూహిక అత్యాచార బాధితురాలు జోర్డాన్ అనారోగ్య కారణాలతో శుక్రవారం కన్నుమూశారు. 2012 ఫిబ్రవరిలో అయిదుగురు యువకులు కోలకత్తాలోని పార్క్ స్ట్రీట్ ఏరియాలో సామూహిత అత్యాచారానికి పాల్పడ్డారు. కదులుతున్న కార్ లో అత్యాచారం చేసి బయటికి విసిరేసిన ఘటన అప్పట్లో సంచలనం రేపింది. అప్పటి ముఖ్యమంత్రి మమత బెనర్జీ ఈ ఘటనపై కట్టుకథగా వ్యాఖ్యానించి విమర్శల పాలయ్యారు. చివరికి ఈ కేసులో అయిదుగురిపై కేసు నమోదుకాగా, ప్రధాన నిందితుడు సహా ఇద్దరు ఇంకా పరారీలో ఉన్నారు. ముగ్గురు జైల్లో ఉన్నారు.
కాగా స్వయంగా బాధితురాలైన ఆమె మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, దాడులకు వ్యతిరేకంగా కోలకత్తా వీధుల్లో అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు. లైంగికదాడికి గురయిన వారి బాధ ఎలా ఉంటుందో తనకు తెలుసు..మౌనాన్ని వీడి మన బాధను పంచుకోవడం ద్వారా ఆ భయంకర గాయాల నుండి బైటపడాలంటూ బాధితులకు ధైర్యం చెప్పేవారు. అంతేకాదు అత్యాచార బాధితుల పునరావాసం కోసం ఒక హెల్ప్ లైన్ కూడా ఏర్పాటు చేశారు.