పార్లమెంట్ ఎన్నికలకు కాంగ్రెస్ ముందస్తు కార్యాచరణ!
సాక్షిప్రతినిధి, ఖమ్మం: 'పార్లమెంట్ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సన్నద్ధమవుతోంది. ఇటీవల రాష్ట్రంలో విజయం సాధించిన పార్టీ.. త్వరలో జరిగే లోక్సభ ఎన్నికల్లోనూ రాష్ట్రంలోని 17 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా మంత్రులు, ముఖ్య నేతలు సమన్వయంతో ముందుకు వెళ్లేలా కార్యాచరణ రూపొందించింది. ఈ నేపథ్యాన అన్ని స్థానాలకు పార్టీ ఇన్చార్జిలను నియమించింది. ఖమ్మం, మహబూబాబాద్ లోక్సభ స్థానాల బాధ్యతను రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి అప్పగించింది. అలాగే డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్కను సికింద్రాబాద్, హైదరాబాద్, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జ్లుగా నియమించారు. సీఎం రేవంత్రెడ్డి తర్వాత జిల్లాకు చెందిన భట్టి, పొంగులేటికి రెండేసి పార్లమెంట్ స్థానాల బాధ్యతలు కట్టబెట్టడం విశేషం.'
రాజకీయంగా సీనియర్ నాయకులు, మంత్రులైన భట్టి, తుమ్మలకు పార్టీ అధిష్టానం ప్రాధాన్యత ఇచ్చి రాజధానిలోని పార్లమెంట్ స్థానాల ఇన్చార్జి బాధ్యతలు అప్పగించింది. సామాజిక సమీకరణలు, గతంలో పనిచేసిన అనుభవాన్ని పరిగణనలోకి తీసుకొని భట్టిని సికింద్రాబాద్, హైదరాబాద్, తమ్మలను మల్కాజ్గిరి ఇన్చార్జిగా నియమించారు. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా భట్టి హైదరాబాద్లో ప్రచారం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం దక్కించుకుని రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన నేపథ్యాన జోష్లో ఉన్న పార్టీ శ్రేణులు అదే ఉత్సాహంతో లోక్సభ ఎన్నికలకు సై అంటున్నాయి.
పొంగులేటికి కీలకంగా..
ఖమ్మం పార్లమెంట్ స్థానం ఖమ్మం, భద్రాద్రి జిల్లాలో విస్తరించి ఉండగా, మహబూబాబాద్ పార్లమెంట్ స్థానంలో ఇక్కడి అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. దీంతో ఈ రెండు స్థానాల ఇన్చార్జిగా మంత్రి పొంగులేటి కొనసాగుతారు. అసెంబ్లీ ఎన్నికల్లో పొంగులేటి ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే కాకుండా మహబాబాబాద్, వనపర్తి, నల్లగొండ జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారు. ఆయన ప్రచారానికి వెళ్లిన అన్ని స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పదికి పది స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయమే తమ లక్ష్యమని చెప్పగా.. భద్రాచలం మినహా ఎనిమిది స్థానాల్లో కాంగ్రెస్, పొత్తులో భాగంగా కొత్తగూడెంలో సీపీఐ విజయం సాధించాయి. ఈ మేరకు భట్టి, తుమ్మలతో సమన్వయం చేసుకుంటూ పార్టీ అభ్యర్థుల విజయంలో కీలక పాత్ర పోషించిన పొంగులేటిని అధిష్టానం ప్రత్యేకంగా గుర్తించినట్లు రెండు పార్లమెంట్ స్థానాల ఇన్చార్జి బాధ్యతలు అప్పగించడంతో స్పష్టమవుతోంది. ఈ రెండింటి పరిధిలో 14 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా, భద్రాచలంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పొత్తుతో కొత్తగూడెం స్థానాన్ని సీపీఐ దక్కించుకోగా.. మిగిలిన 12 స్థానాల్లో కాంగ్రెస్ విజయదుందుభి మోగించింది.
దీంతో రెండు పార్లమెంట్ స్థానాల పరిధిలో పొంగులేటికి ఉన్న పరిచయాలు, పార్టీ కేడర్, కుటుంబ బంధుత్వం లోక్సభ ఎన్నికల్లోనూ అభ్యర్థుల విజయానికి కలిసొస్తుందన్న భావనతో ఆయనకు ఈ బాధ్యతలు ఇచ్చినట్లు పార్టీ నేతల ద్వారా తెలిసింది. కాగా, ఖమ్మం లోక్సభ స్థానం పరిధిలో ఖమ్మం, పాలేరు, మధిర, వైరా, సత్తుపల్లి, కొత్తగూడెం, అశ్వారావుపేట అసెంబ్లీ నియోజకవర్గాలు, మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలో మహబాబాబాద్, డోర్నకల్, నర్సంపేట, ములుగు, పినపాక, ఇల్లెందు, భద్రాచలం అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.
ఇవి కూడా చదవండి: ‘పార్లమెంట్’పై కాంగ్రెస్ 0గురి! ఆ స్థానాలకు పోటాపోటీగా..