సార్వత్రిక ఎన్నికలకు సర్వం సిద్ధం
కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్ : పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం చేసినట్లు జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి సి.సుదర్శన్‌రెడ్డి తెలిపారు. రెండు పార్లమెంటు స్థానాలకు 26 మంది, 14 అసెంబ్లీ నియోజకవర్గాలకు 179 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారన్నారు. సోమవారం ఉదయం సమావేశ మందిరంలో ఎస్పీ రఘురామిరెడ్డితో కలసి కలెక్టర్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా 30,56,867 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇందులో 15,20,377 మంది పురుషులు, 15,36,091 మంది స్త్రీలు, 399 మంది ఇతరులున్నారు. వీరికోసం 3,303 పోలింగ్ కేంద్రాలు చేశారు.
ఇందులో అర్బన్ ప్రాంతాల్లో 1,022, గ్రామీణ ప్రాంతాల్లో 2,281 ఉన్నాయి. ఫొటో ఓటరు స్లిప్‌లు పంపిణీ సోమవారం నాటితో పూర్తయింది. జాబితాలో పేరుండి స్లిప్ అందకపోతే పోలింగ్ స్టేషన్ దగ్గర బీఎల్‌ఓలను సంప్రదిస్తే అందజేస్తారు. 7వ తేదీ ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. 320 మంది సెక్టోరల్ ఆఫీసర్లు, 379 మంది రూట్ ఆఫీసర్లు ఎన్నికల విధుల్లో ఉంటారు. జిల్లావ్యాప్తంగా 553 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో లైవ్ వెబ్ క్యాస్టింగ్‌తో పాటు 250 మంది మైక్రో అబ్జర్వర్లు కూడా పని చేస్తారు.
8,990 బ్యాలెట్ యూనిట్లు, 7,200 కంట్రోల్ యూనిట్లను వినియోగిస్తున్నారు. ఈవీఎంల మొరాయించే అవకాశం లేకుండా పక్కాగా ఉంచారు. వస్తే రిజర్వులో ఉన్నవాటిని వినియోగించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. పోలింగ్ రోజు ఎంపీ అభ్యర్థులు 9, ఎమ్మెల్యే అభ్యర్థులు 3 వాహనాలను మాత్రమే వినియోగించాల్సి ఉంది. ఎస్పీ రఘురామిరెడ్డి మాట్లాడుతూ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు 16 కంపెనీల బలగాలను వినియోగిస్తున్నాన్నారు.
ఆరువేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో డీఎస్పీ స్థాయి అధికారి పర్యవేక్షణ ఉంటుందన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద 144వ సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. 78 క్విక్ రియాక్ట్ టీమ్‌లు, 42 స్ట్రైకింగ్ ఫోర్స్ బృందాలు పని చేస్తాయన్నారు.