సాక్షి, కాకినాడ : పోలీసు పోస్టల్ బ్యాలట్‌లో తొలిరోజైన శుక్రవారం 39 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం ఓట్లు 2,913 కాగా 1145 ఓట్లు మాత్రమే పోలై 39 శాతం పోలింగ్ నమోదైంది. మధ్యాహ్నం ఒంటిగంటకు గానీ బ్యాలట్ పేపర్లు ఆయా సబ్‌డివిజినల్ కేంద్రాలకు చేరుకోలేదు.
జిల్లాలో మొత్తం 4,500 మంది పోలీస్‌లు, హోంగార్డులు ఉండగా కేవలం 2,913 మంది మాత్రమే ఓటర్లుగా నమోదు కావడం విశేషం. పోలింగ్ సమయం ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఉంది. అయితే బ్యాలట్ పేపర్లు చాలా డివిజన్లలో మధ్యాహ్నం ఒంటిగంటకు గానీ చేరకపోవడంతో పోలింగ్ ఆలస్యంగా జరిగినట్టు సమాచారం.
దానికి తోడు అభ్యర్థుల ఏజెంట్లు రావడం ఆలస్యం కావడం, దాంతో బ్యాలట్ బాక్సులకు సీళ్లు వేయడం ఆలస్యమైంది. పెద్దాపురం పోలీసు డివిజన్ పరిధిలోని నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రత్తిపాడు,జగ్గంపేట,తుని రిటర్నింగ్ అధికార్లు పెద్దాపురం పోలీసు పోస్టల్ బ్యాలట్ పోలింగ్ కేంద్రానికి రాలేదు.
అక్కడకు చేరుకున్న కలెక్టర్ నీతూప్రసాద్ వారి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్, అసెంబ్లీ పోస్టల్ బ్యాలట్ పేపర్లు తెలుపు, గులాబీ రంగుల్లో ఉండగా బ్యాలట్ బాక్స్‌లకు కూడా పార్లమెంటుకు తెలుపురంగు, అసెంబ్లీకి పింక్ కలర్ కాగితాలు అంటించారు.నేడు పోస్టల్ బ్యాలట్ వినియోగించుకోలేకపోయిన పోలీసు సిబ్బంది ఈనెల 26,27,28,30 తేదీల్లో ఓటు వేయాల్సిందిగా కలెక్టర్ నీతూప్రసాద్ శుక్రవారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. పోలీసులు, ఇతర ఉద్యోగులు నూరుశాతం పోలింగ్‌లో పాల్గొని అందరికీ ఆదర్శంగా నిలవాలని ఆమె విజ్ఞప్తి చేశారు.