సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్ సి.హెచ్ శివలింగయ్య
మహబూబాబాద్ : జిల్లాలో మే 10 నుంచి పాసుపుస్తకాలు, చెక్కుల పంపిణీని పారదర్శకంగా చేపట్టాలని, ఇందుకోసం రెవెన్యూ, పోలీసు, వ్యవసాయ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సీహెచ్ శివలింగయ్య ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా వచ్చే నెల 10 నుంచి 17 వరకు రైతు బంధు చెక్కులు, కొత్త పట్టాదారు పాసుపుస్తకాలు 1,20,000 మందికి అందజేసేందుకు ఏర్పాటు చేయాలని చెప్పారు. భూ రికార్డుల శుద్ధీకరణ చేసి తదుపరి జిల్లా వ్యాప్తంగా భూమి ఖాతా గల రైతులకు వ్యవసాయ పెట్టుబడి కింద రూ.119 కోట్లు అందించనున్నట్లు తెలిపారు.
రైతుకు 12 ఎకరాల కన్నా ఎక్కువ భూమి ఉంటే రెండు చెక్కులు అందజేయనున్నట్లు తెలిపారు. 95 బృందాలను ఏర్పాటు చేసి బృందానికి నలుగురు చొప్పున అధికారులకు విధులు కేటాయించి ఇద్దరు పాసుపుస్తకాలు, ఇద్దరు చెక్కుల పంపిణీ చేయాలన్నారు. పట్టాదారు పాసుపుస్తకాలు ఉన్నవారికి మాత్రమే చెక్కు అందించాలని సూచించారు. ప్రతి బృందానికి ఒక కానిస్టేబుల్ అందుబాటులో ఉంటారని తెలిపారు. మండల స్థాయిలో పంపిణీ కేంద్రాలను ఎంపీడీఓ, తహసీల్దార్, ఎస్సైలు సంయుక్తంగా పర్యవేక్షించాలన్నారు. జిల్లాలో ఆర్‌ఓఎఫ్‌ఆర్ పట్టాలు ఉన్న ఆరు వేల మంది కూడా వ్యవసాయ సబ్సిడీ ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని కలెక్టర్ తెలిపారు.
ఆ పథకానికి సంబంధించిన సందేహాల నివృత్తికి 18004250318 టోల్ ఫ్రీ నంబర్‌కు లబ్ధిదారులు కాల్ చేయవచ్చని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా 28 బ్రాంచ్‌లు ఉన్నా యని ఏ మండల బ్యాంకు చెక్కు ఆ బ్యాంకులోనే నగదుగా తీసుకోవాలని సూచించారు. లబ్ధిదారులు పట్టాదారు పాసుపుస్తకం మొదటి పేజీ, ఆధార్ జిరాక్స్, చెక్కుతో పాటు బ్యాం కులో సమర్పించి నగదు పొందవచ్చని చెప్పారు. ఎస్పీ కోటిరెడ్డి మాట్లాడుతూ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకుకు పోలీసు శాఖ సహకరిస్తుందన్నారు. మండలానికి ఒక ఎస్సై 95 బృందాలకు 95 మంది కానిస్టేబుళ్లను నియమిస్తున్నట్లు చెప్పారు. జేసీ కె.దామోదర్‌రెడ్డి, డీఆర్వో డాక్టర్ పి.రాంబాబు, ఆర్డీఓ కృష్ణవేణి, ఎల్‌డీఎం రాఘవేంద్ర, డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.
ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలి
జిల్లాలో ఇసుక దుర్వినియోగం కాకుండా అధికారులు పర్యవేక్షించాలని కలెక్టర్ సీహెచ్.శివలింగయ్య ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని సమావేశ మందిరంలో పోలీస్, రెవెన్యూ శాఖల అధికారులతో శుక్రవారం సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలన్నారు. జిల్లా వ్యాప్తంగా 12 ఇసుక రవాణా పాయింట్లు ఉన్నాయని, ప్రభుత్వం చేపట్టిన డబుల్ బెడ్‌రూం ఇళ్లు, మరుగుదొడ్లు, సీసీ రోడ్లు తదితర నిర్మాణాలకు అవసరమయ్యే ఇసుక మంజూరుకు సంబంధిత ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, తహసీల్దార్ అనుమతులు ఇవ్వాలని సూచించారు. ఎస్పీ కోటిరెడ్డి, జేసీ కె.దామోదర్‌రెడ్డి, డీఆర్వో రాంబాబు, ఆర్డీఓ కృష్ణవేణి, మైనింగ్ అసిస్టెంట్ డైరెక్టర్ రామాచారి, డీఎస్పీలు రాజారత్నం, నరేష్‌కుమార్, సీఐలు, ఎస్సైలు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment