పార్లమెంట్ భద్రత పెంచాలి!
న్యూఢిల్లీ: పార్లమెంట్ భవన భద్రతా వ్యవస్థలో పలు లోపాలు ఉన్నాయని పార్లమెంటరీ కమిటీ ఒకటి పేర్కొంది. భవ న సముదాయంలో ఏర్పాటు చేసిన 450 సీసీటీవీ కెమెరాల్లో 100 పనిచేయడం లేదని తెలిపింది. మొత్తం 12 గేట్ల వద్ద భద్రతను పెంచాలని సూచించింది. ముగ్గురు ఎంపీలు.. ఆర్కే సింగ్(కేంద్ర హోం శాఖ మాజీ కార్యదర్శి), సత్యపాల్ సింగ్(ముంబై మాజీ పోలీస్ కమిషనర్), హరీష్ చంద్ర మీనా(రాజస్థాన్ మాజీ డీజీపీ)తో కూడిన ఈ కమిటీ ఇటీవల తన నివేదికను లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్‌కు అందజేసింది.
పార్లమెంట్‌లోని భద్రతా సిబ్బందిలో చాలామందికి బుల్లెట్ ప్రూఫ్ హెల్మెట్లు, జాకెట్లు, ఆధునిక ఆయుధాలు లేవని, పలు పరికరాలు కాలం చెల్లినవని కమిటీ తెలిపిందని విశ్వసనీయ వర్గాలు చెప్పాయి. పార్లమెంట్ గేట్ల వద్ద అండర్ వెహికల్ స్కానింగ్ సిస్టమ్ యంత్రాలను, ఇతర భద్రతా పరికరాలను, కమ్యూనికేషన్ వ్యవస్థను ఆధునీకరించి, జాగిలాలు, నిఘా టవర్లను పెంచాలని కమిటీ సిఫార్సు చేసిందన్నాయి.