స్థలం సాకు.. ప్రాజెక్టులకు బ్రేకు
ఉప ముఖ్యమంత్రి కేఈ వద్ద వాపోయిన ప్రజా ప్రతినిధులు
కోటగుమ్మం (రాజమహేంద్రవరం సిటీ) : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన పలు సంస్థలను రాజమహేంద్రవరంలో నెలకొల్పకుండా స్థలం కొరతతో ఇతర ప్రాంతాలకు తరలించేస్తున్నారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూశాఖ మంత్రి కేఈ కృష్ణమూర్తి వద్ద పలువురు ప్రజాప్రతినిధులు మొర పెట్టుకున్నారు. రాజమహేంద్రవరం ఆర్ అండ్‌బీ అతిథిగృహంలో రాజమహేంద్రవరం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మేయర్‌తో మంగళవారం మంత్రి కృష్ణమూర్తి అభివృద్ధి, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై సమీక్ష నిర్వహించారు. మంత్రి కృష్ణమూర్తి మాట్లాడుతూ దివాన్‌చెరువు, లాలాచెరువు, మోరంపూడి, వేమగిరి, జొన్నాడ వద్ద ఫ్లై ఓవర్ల నిర్మాణానికి అనుమతి వచ్చిందన్నారు. నిర్మాణానికి రూ.451 కోట్లు, భూ సేకరణ కోసం రూ.388 కోట్లను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. త్వరలోనే టెండర్ల ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉందన్నారు.
ఇంత మంది ఉన్నా ప్రయోజనం సున్నా : ఎమ్మెల్సీ సోము
రాజమహేంద్రవరం పరిధిలో ముగ్గురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలు, ఒక ఎంపీ, మేయర్ ఉన్నా వారి వల్ల నగరానికి ఒరిగిందేమీ లేదని ఎమ్మెల్సీ సోము వీర్రాజు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. నగరానికి వచ్చిన ప్రాజెక్టులన్నీ ఇతర ప్రాంతాలకు తరలిపోతుంటే తామంతా ఏమీ చేయలేకపోతున్నామని ప్రజలు విమర్శిస్తున్నారన్నారు. పెట్రోలియం యూనివర్శిటీ, ప్యాకింగ్ యూనిట్, మరో కొత్త యూనిట్ రాజమహేంద్రవరానికి వచ్చి తిరిగి వేరే ప్రాంతానికి వెళ్లిపోయాయన్నారు. భూ సమస్యను పరిష్కరించుకోవడానికి అవకాశం ఉందని, నగర పరిధిలో 90 ఎకరాల రెవెన్యూ లాండ్ ఉందని, మరో 100 ఎకరాల భూమి కోర్టు పరిధిలో ఉందన్నారు. ఎంపీ మాగంటి మురళీమోహన్ మాట్లాడుతూ కేంద్ర సంస్థలు, పథకాలు అనేకం ఉన్నా స్థలాభావంతో వాటిని ఇక్కడ ఏర్పాటు చేయలేకపోతున్నామని, గట్టిగా అడిగితే స్థలం ఉండటం లేదన్నారు. ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి మాట్లాడుతూ పాలచర్ల, కడియం ప్రాంతాల్లో సుమారు 200 ఎకరాలు గుర్తించామని, ప్రస్తుతం రెవెన్యూ అధికారుల అధీనంలోనే ఉందన్నారు. దివాన్‌చెరువు అటవీ భూమిలో 500 ఎకరాలను కన్వర్ట్ చేస్తే నగర అభివృద్ధికి దోహదపడుతుందన్నారు. మేయర్ పంతం రజనీ శేషసాయి మాట్లాడుతూ ఘన చరిత్ర కలిగిన రాజమహేంద్రవరం స్మార్ట్ సిటీలో లేకుండా పోయిందన్నారు. కనీసం హృదయ్ పథకంలోనైనా పెట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ మాట్లాడుతూ జాతీయ రహదారిపై నిర్మించనున్న ఫ్లై ఓవర్ వంతెనల వ్యవహారం ఏ పరిస్థితిలో ఉందో స్పష్టం చేయాలని కోరారు. వీటిపై సంబంధిత అధికారులను మంత్రి కృష్ణమూర్తి వివరణ కోరగా ఫైనాన్స్ కమిటీ ఆమోదం ఇవ్వాల్సి ఉందని చెప్పారు. సబ్ కలెక్టర్ విజయకృష్ణన్, నగరపాలక సంస్థ కమిషనర్ వి.విజయరామరాజు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.