శ్రీకారాలు - శ్రీమిరియాలు
పేరడీ రచనకు ఆద్యులు
నిన్న మొన్నటి దాకా తెలుగు నేలన ప్రతిధ్వనించిన కొన్ని పద్యపాదాలు ఇప్పటికీ చెవుల్లో రింగుమంటుంటాయి. ‘‘అల్లుడా రమ్మని ఆదరంబున బిల్వ..., నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష, ముదితల్ నేర్వగరాని విద్యగలదే ముద్దార నేర్పించినన్, భరతఖండంబు చక్కని పాడియావు’’ ఇవేగాక పసిబిడ్డబాలాది పాడుకున్న చాలా పద్యాలు రచించిన మహాకవి చిలకమర్తి లక్ష్మీనరసింహం. వందేళ్ల తరువాత చేయాల్సిన ప్రయోగాల్ని, చేపట్టాల్సిన ప్రక్రియల్ని వందేళ్ల క్రితమే చేపట్టారు.
దేశభక్తి గేయాలు, గయోపాఖ్యానం లాంటి పద్య నాటకాలు, అనేకానేక ప్రహసనాలను రచించి తెలుగు సాహిత్యాన్ని తెలుగుజాతిని చైతన్యపరిచారు. చిలకమర్తి 1867లో పుట్టారు. టంగుటూరి ప్రకాశంకి సమకాలికులు, ఆప్తులు. చిలకమర్తి రూపొందించిన అనేక పాత్రలను ప్రకాశం ధరించారు. ఆ రోజుల్లో ప్రకాశం స్త్రీ పాత్రలను కూడా ధరించి పేరు తెచ్చుకున్నారు. తెలుగులో హాస్యం చిలకమర్తితోనే శ్రీకారం చుట్టుకుంది. నూటపాతిక సంవత్సరాల క్రితమే తెలుగులో పేరడీ ప్రక్రియను చిలకమర్తి చేపట్టారు.
‘‘లండను సంకల్పము’’ అనే ప్రహసనంలో లండన్‌లో ఉన్నవాడు సంకల్పం ఎలా చెప్పుకుంటాడో చెప్పారు. ‘‘లండన్ వే స్వాహా, జూశసేస్వాహా, జుహావాదేవశ్య ధీమహే, ధీయో యోనః ప్రబోదయాత్ - మమ ఉపాక్త ధనవ్యయ ద్వారా కాంటినెంటల్ టూర్ సంప్రాప్తర్థం... అఖండ ధ్యేమ్యునద్యాం అంటూ సాగుతుంది. అర్థం లేని ఆచారాలను, వ్యవహారాలను తీవ్రంగా నిరసించారు.
మన వ్రతాలు నోముల కథల్లో నైమిశారణ్యం, శౌనకాది మునులు, సూతమహర్షి తప్పక వినిపిస్తాయి. రుషులకు మహర్షులకు వచ్చే ధర్మ సందేహాలకు సూతమహర్షి జవాబులు చెబుతూ ఉంటాడు. ఇదే సంప్రదాయంలో కథ చెబుతూ కొన్ని పేరడీ ప్రశ్నల్ని జవాబుల్ని చిలకమర్తి హాస్యస్నోరకంగా అందించారు. నల్లుల బాధ భరించలేకనే విష్ణుమూర్తి శేషతల్పాన్ని ఆశ్రయించాడట.
చాకితోడ జగడాలు పడలేక సిరిగలాడు పట్టుచీరెగట్టి శివుడు తోలు గప్పె, ఛీయని మదిరోసి భైరవుండు చీరపారవేసె
అందుకని శివుడు దిగంబరుడైనాడని తీర్మానించారు. భగవద్గీతలో సృష్టిలోని సర్వోత్తమ వస్తువులన్ని నేనేనని చెప్పే ఘట్టాన్ని హాస్యానుకరణ చేశారు. ‘‘వృక్షములలో గంజాయి మొక్కను నేను. జంతువులలో పెద్దపులిని నేను. ప్రాకెడి పురుగులలో పామును నేను. లంచము నేను, లంచమిచ్చిన సొమ్మును నేను, లంచము తెచ్చిన రాయబారిని నేను. ... వేయేల సమస్తం నేను’’ అంటూ పెద్ద జాబితాతో ముగించారు. అతి ప్రాచీనంలోకి వెళ్లి, మూలాలను కదిలించి నవ్విస్తూ చురకలు వేయడానికి పలుకే కాదు ధైర్యం కూడా కావాలి. ఆనాడు చూపిన వ్యంగ్య ధోరణులను చాలామంది అందిపుచ్చుకున్నారు.
1915లో శ్రీకృష్ణ దేవరాయాంధ్ర భాషా గ్రంథాలయ వార్షికోత్సవానికి చిలకమర్తిని అధ్యక్షునిగా ఆహ్వానించారు. రావిచెట్టు లక్ష్మీనరసమ్మ గారింట్లో బస ఏర్పాటు చేశారట. ఆ సభలో సరోజిని నాయుడు, సర్ హైదరాలీ సమక్షంలో చిలకమర్తిని సన్మానించారు. హైదరాబాదులో జరిగిన ఈ కార్యక్రమానికి పూనిక మాటపాటి హనుమంతరావు. ఏమైనా ఈ బహుముఖ ప్రజ్ఞాశాలిని తెలుగుజాతి ఒకసారి స్మరించుకోవాలి.
ఫోర్జరీ!
‘‘నన్ను, నా నడకని, నా నవ్వుని ఫోర్జరీ చేసేస్తున్నాడు. ఆఖరికి నా బతుకుని కూడా ఫోర్జరీ చేసి బతికేస్తున్నాడు’’
‘‘అదెలాగ?’’
‘‘నే పెళ్లి చేసుకుంటే వాడూ చేసుకున్నాడు నే కాపరం పెడితే వాడూ పెట్టాడు. నాకిద్దరు పిల్లలు. వాడికీ ఇద్దరు. మొన్నామధ్య విసిగి వేసారిపోయిన నా భార్య నన్నొదిలేసి వెళ్లిపోయింది. విసిగించి వాళ్లావిడ వెళ్లిపోయేలా చేసాడు. ఫోర్జరీ....’’ అంటూ నిట్టూర్చాడు.
చెప్పు!
డబ్బులు లేక చెప్పులు కొనలేకపోతున్నా. డబ్బుల కోసం చెప్పులరిగేలా తిరుగుతున్నా. ఈ సంగతెవరికీ ‘‘చెప్పుకొనలేక’’పోతున్నా.
- శ్రీశ్రీ
ఫలానా వారి కూతుర్ని, ఫలానా వారి కోడల్ని నాకు గోమయం అంటే తెలియదా అని గోంగూర తెచ్చినట్టు!
- తెలుగు నానుడి
కాలం
ఆ గదిలో గోడగడియారం అయిదు గంటల యాభై రెండు నిమిషాల దగ్గర ఆగిపోయింది. ఇంటి యజమాని వయోవృద్ధుడు. ఆ గదిలోనే పడుకుంటాడు. ఎదురుగా దాన్నే చూస్తూ పొద్దు పుచ్చుతాడాయన. ఆ పాత గడియారాన్ని ఎవరూ పట్టించుకోలేదు. ఆగిపోయి, రోజూ రెండుసార్లు మాత్రమే సరైన వేళ చెబుతూ గోడకి అంతుక్కుపోయి ఉందా గడియారం. పెద్దాయన ఓపిగ్గా ఉన్నన్నాళ్లూ దానికి ‘కీ’యిచ్చి నడిపిస్తుండేవాడు. తిరగడానికి, గంటలు కొట్టడానికి రెండు చోట్ల దానికి కీ ఇవ్వాలి. రుతువుని బట్టి లోలకం పొడుగుని సవరించాలి. ఇవన్నీ యజమానికి తెలుసు. ఒక రోజు ఆయన కన్ను మూశాడు. సరిగ్గా అయిదు గంటల యాభై రెండు నిమిషాలకే. దీనికి ఏమైనా శాస్త్రీయ కారణం ఉందా? ఆగిపోయిన వేళ గురించి ఆయన మనసులో ఆలోచన ఉందా? ఏమో, తెలుసుకోవాలి.
ఆశాజీవి
మన పురాణాలలో వినవచ్చే కామధేనువు, కల్పతరువు చాలా విశిష్టమైనవి. అవి రెండూ యజమాని ఏమి కోరినా ఇస్తాయి. అంటే తరగని వరాలు పెరట్లో ఉన్నట్టే. అందులో ఒకటి జంతువు, మరొకటి వృక్షం. ఇదంతా పురాణం అనేవారు సైతం నిర్మాతల ఊహని మెచ్చాల్సిందే. వాటిని నిగ్రహశక్తికి, సహనానికి సంతృప్తికి పరీక్షలుగా నిలిపారు.
కామధేనువు ఏది కోరినా ఇస్తుంది. అట్లాగని అది అధీనంలో ఉన్నవారు పుట్లకొద్దీ బంగారం సంపాయించి నేల పాతర్లు వేయలేదు. కోరితే నవరత్న రాశుల్ని కురిపించగల కల్పతరువుని వజ్ర వైఢూర్యాలకై వేధించలేదు. నిగ్రహం, సంతృప్తి పుష్కలంగా ఉన్నవారి దగ్గరే ఇవి ఉన్నాయి. వాటిని స్వార్థానికి, పదవులు కాపాడుకోవడానికి వినియోగించుకోవాలనేవారికి అవి దక్కలేదు. నిరాడంబరమైన జీవితం గడిపేసరికి మామూలు గోవి కామధేనువుగా, కాసే పూసే మామూలు చెట్టు కల్పతరువుగా అనిపిస్తాయి. మనిషి అత్యాశ వల్ల, తీరని దాహం వల్ల నదుల్ని ఎండగడుతున్నాడు, అడవుల్ని ఎడారులు చేస్తున్నాడు. భూగర్భ నిధుల్ని తోడేసి భూమిని గుల్ల చేసేస్తున్నాడు. మనిషి ఆశని పూరించే శక్తి నక్షత్ర మండలానికి కూడా ఉండదు.
నిర్వచనం
పెద్ద పెద్ద దొరలు, బంగళాల్లో ఉండేవారు ఎక్కువగా తింటారు కాబట్టి బంగాళాదుంపలని పేరొచ్చింది. నిజానికవి మన కందమూలలే. ప్రాచీన రుషులు చిలకడదుంపలతో పాటు వీటినీ తినేవారు. బంగాళాదుంప మన తెలుగు సంప్రదాయం.
వి॥
పెన్ డ్రాప్స్
- అంబేద్కర్‌ని ఒక్కసారి వెలుగులోకి తెచ్చారు. ఇప్పుడాయన ఔన్నత్యాన్ని, కీర్తి ప్రతిష్టల్ని పంచుకునే పనిలో పడ్డారు. సింహభాగాల కోసం తహతహలాడుతున్నారు.
- లోక్‌సభకి గాని రాజ్యసభకి గాని సభ్యులు సైకిళ్ల మీద రావొద్దు. టీడీపీకి ప్రచారం కల్పించవద్దు.
- భాజపా.
- చంద్రబాబు తెలుగు గడ్డ మీద కంటే మిగతా భూగోళం మీద గట్టిపట్టు సాధిస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
- శ్రీరమణ