పాడుబడిన బావిలో పడి యువకుని ఆత్మహత్య
పెద్దశ్రీరాంపురం(కంచిలి), న్యూస్‌లైన్: మండలంలోని పెద్ద శ్రీరాంపురం గ్రామానికి చెందిన యువకుడు పర్రి రామారావు(26) గ్రామానికి వెళ్లే మెయిన్‌రోడ్డు పక్కన పాడుబడిన నేలబావిలో పడి ఆదివారం ఆత్మహత్య చేసుకున్నట్టు కంచిలి ఎస్ఐ కె. గోవిందరావు తెలిపారు. ఆయన, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం... మృతుడు పర్రి రామారావు మూడేళ్లే కిందట తాటిచెట్టుమీద నుంచి జారిపడిపోయూడు.
దీంతో 3 నెలలు పాటు కోమాలోకి వెళ్లిపోయాడు. ప్రమాదంలో రామారావు ఎడమకాలు విరిగిపోయింది. ఆపరేషన్ చేసి రాడ్లు వేశారు. తర్వాత కూడా రామారావు మతిస్థిమితం లేకుండా వ్యవహరిస్తుండేవాడు. దీంతో మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకొని ఉంటాడని భావిస్తున్నారు. మృతుడు శనివారం ఉదయం 10 గంటలకు తోటకెళ్తానని ఇంటి నుంచి బయలుదేరి తిరిగి రాకపోవటంతో కుటుంబ సభ్యులు రోజంతా వెతికారు.
ఆదివారం ఉదయాన గ్రామ పొలిమేరల్లో ఉన్న బావిలో శవమై తేలిఉండటాన్ని గుర్తించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందజేశారు. మృతదేహాన్ని సోంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. మృతుని తండ్రి చిరంజీవుల ఫిర్యాదు మేరకు కంచిలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.