ముఖ్యమంత్రిగా తెరపైకి కొత్తపేరు!
గుజరాత్ ముఖ్యమంత్రి ఆనందీ బెన్ పటేల్ బాధ్యతల నుంచి తప్పుకుంటానని ప్రకటించిన నేపథ్యంలో తర్వాతి సీఎం ఎవరనే విషయంపై ప్రతిష్టంభన నెలకొంది. ప్రస్తుతం రవాణా, నీటి సరఫరా మంత్రిగా పనిచేస్తున్న విజయ్ రూపాని పేరు బలంగా వినిపిస్తోంది. 2017లో గుజరాత్ శాసనసభకు ఎన్నికల నేపథ్యంలో పార్టీ కేడర్ పై పట్టుకలిగిన రూపానికే పగ్గాలు అప్పజెప్పాలని బీజేపీ భావిస్తున్నట్లు సమాచారం.
కేవలం కేడర్ పై పట్టే కాక రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్)కు రూపాని అంటే అమితమైన ఇష్టం. పటీదార్లు డామినేట్ చేసే సౌరాష్ట్రా రీజియన్ లోని రాజ్ కోట్ నుంచి ఆయన ఎమ్మెల్యే గా గెలుపొందారు. పటీదార్ ఉద్యమం, దళితుల నుంచి వస్తున్న వ్యతిరేకతను దృష్టిలో ఉంచుకుని అధిష్టానం అన్నింటికీ సమర్ధుడైన నాయకుడిని ఎంపిక చేయాలని భావిస్తున్నట్లు సీనియర్ బీజేపీ లీడర్ ఒకరు తెలిపారు.
అంతేకాకుండా రూపాని.. అమిత్ షా తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అత్యంత సన్నిహితుడు. గుజరాత్ లో ఈబీసీలకు 10శాతం కోటాను ఇస్తున్నట్లు ముఖ్యమంత్రి కాకుండా రూపాని ప్రకటించడమే ఇందుకు ప్రత్యక్షసాక్ష్యం. వ్యవసాయ, రైతు సంక్షేమశాఖ మంత్రి పర్షోత్తమ్ రూపాల ప్రధానిని కలిసినట్లు సమాచారం.
దీంతో ఆయన కూడా సీఎం రేసులో ఉన్నట్లు వాదనలు వినపిస్తున్నాయి. కద్వా కులానికి చెందిన రూపాలను పార్టీ ఉనా ఘటనలో దళితులను పరామర్శించేందుకు పంపింది. కానీ రూపాలను రాజ్యసభకు పంపేందుకు పార్టీ మొగ్గుచూపుతున్నట్లు ఉండటంతో ఆయనకు సీఎం పదవి దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.