మహిళా ఎమ్మెల్యేలకు చేదుఅనుభవం
రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సీమాంధ్ర జిల్లాల్లో ఆందోళనలు, నిరసనలు రోజు రోజుకు ఉధృతమవుతున్నాయి. ప్రజలే నాయకులుగా ఉద్యమం నడిపిస్తున్నారు. ధర్నాలు, రాస్తారోకోలు, నిరాహారదీక్షలు, భారీ ప్రదర్శనలతో ఆందోళనలు చేస్తున్నారు. లక్షలాది గళాలతో మహోగ్రంగా సమైక్య నినాదాలు విన్పిస్తున్నారు. తమతో కలిసిరాని ప్రజా ప్రతినిధులను ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. రాజీనామాలు చేసి ఉద్యమంలోకి రావాలని అడ్డుకుంటున్నారు.
ఇద్దరు మహిళా ఎమ్మెల్యేలను సమైక్యవాదులు అడ్డుకున్నారు. వైఎస్సార్ జిల్లా బద్వేల్ సమైక్యవాదుల సభలో బద్వేల్ ఎమ్మెల్యే కమలమ్మకు చేదు అనుభవం ఎదురయింది. సభలో ప్రసంగించొద్దని ఆమెకు సమైక్యవాదులు అడ్డుతగిలారు. విజయనగరం జిల్లా పార్వతీపురం ఎమ్మెల్యే జయమణిని ఉపాధ్యాయ సంఘాలు అడ్డుకున్నాయి. రాజీనామాచేసి ఉద్యమంలో పాల్గొనాలని డిమాండ్ చేస్తూ జయమణికి వ్యతిరేకంగా ఆందోళనకారులు నినాదాలు చేశారు.