ఏఓబీలో మళ్లీ అలజడి !
పార్వతీపురం :కొంత కాలంగా ప్రశాంతంగా ఉన్న ఏఓబీలో మళ్లీ అలజడి రేగింది. పార్వతీపురం సబ్-ప్లాన్‌కు కూ త వేటు దూరంలో ఉన్న ఒడిశా రాష్ట్రంలోని రాయగడ సమీపంలోని మునిగుడ, బందుగాం బ్లాక్‌లోని మంగలాపూర్ వద్ద జరిగిన సంఘటనలతో ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లోని ప్రజలు భయాందోళన చెందుతున్నారు. శుక్రవారం రాత్రి కొమరాడ మండలం సరిహద్దుల్లో ఉన్న రాయగడ సమీపంలో మునిగుడ వద్ద రైలు పట్టాలను మావోయిస్టులు పేల్చివేశారు. పార్వతీపురం, కొమరాడ సరిహద్దులకు సమీపంలో ఉన్న బందుగాం బ్లాకులోని మంగలాపూర్ వద్ద 118 బీఎస్ఎఫ్ బెటాలియన్ జవాన్లు కూంబింగ్ చేస్తుండగా శనివారం రెండు మందు పాతరలు, జిలెటిన్ స్టిక్స్ లభ్యమయ్యాయి. ఈ రెండు సంఘటనలు సరిహద్దు గ్రామాల ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి.
మావోయిస్టులు తమ ఉనికిని, నిరసనను తెలిపేందుకు రాయగడ నుంచి పార్వతీపురం వరకున్న రైల్వే స్టేషన్లు, పట్టాలను తరచూ పేల్చివేస్తున్నారు. అలాగే ఇన్ఫార్మర్ల నెపంతో కాల్చిచంపేశారు. గతంలో కొమరాడ మండలం కూనేరు రైల్వే స్టేషన్ మీద సుమారు 20 మంది మావోయిస్టులు దాడిచేసి ధర్మా భూపతిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ క్యాబిన్, కంప్యూటర్ బోర్డు తదితరవి తగలబెట్టారు. ఈ సంఘటనలో దయ లాంటి కీలక నేతలు పాల్గొన్నారు. 1998 సంవత్సరం ఆగస్టు లో కొప్పడంగి వద్ద వారోత్సవాలు నిర్వహిస్తున్న మావోయిస్టులు, పోలీసులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో తొమ్మిది మంది మావోయిస్టులు, ముగ్గురు పోలీసులు మృతి చెందారు. 2003 సంవత్సరం మార్చిలో గుమడ రైల్వే స్టేషన్‌పై ఆరుగురు మావోయిస్టులు దాడి చేసి స్టేషన్ గదులు పేల్చివేశారు.
2003 ఆగస్టులో 30మంది మావోయిస్టులు కూనేరు రైల్వే స్టేషన్లో డీఎంయూ రైలును ఆపి కాల్పులు జరిపారు. ఈ సంఘటనలో నలుగురు ఆర్పీఎఫ్ జవాన్లు మృతి చెందారు. 2007లో జూన్‌లో కొమరాడ గ్రామంలోని రామ మందిరం వద్ద మావోయిస్టులు అలజడి సృష్టించారు. 2008లో మావోయిస్టులు గుమడ రైల్వే స్టేషన్‌పై దాడి చేసి సిగ్నల్ బోర్డును ధ్వంసం చేశారు. 2008లో రెబ్బ గ్రామానికి చెందిన కొండగొర్రి తిరుపతి అనే వ్యక్తిని పోలీస్ ఇన్ఫార్మర్ నెపంతో హతమార్చారు. 2008లో గాజుల గూడ వద్ద బాంబు పేల్చిన సంఘటనలో ఆర్ఎస్ఐ రవికుమార్ తీవ్రంగా గాయపడ్డారు. తరువాత స్తబ్ధుగా ఉన్న మావోయిస్టులు ఇప్పుడు రైలు పట్టాలను పేల్చివేయడంతో ఏఓబీలో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.