11, 13 తేదీల్లో గ్రూపు-2 రాత పరీక్ష
⇒ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన టీఎస్పీఎస్సీ
⇒ ఉదయం 9.45 గంటల వరకు, మధ్యాహ్నం 2.15 గంటల వరకే పరీక్ష హాల్లోకి అనుమతి
⇒ నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదు
⇒ ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 1,032 పోస్టుల భర్తీకి ఈనెల 11, 13 తేదీల్లో గ్రూపు-2 రాత పరీక్షను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు టీఎస్పీఎస్సీ కార్యదర్శి పార్వతి సుబ్రహ్మణ్యన్ తెలిపారు. 7.83 లక్షల మంది అభ్యర్థులు రాష్ట్ర వ్యాప్తంగా 1,916 కేంద్రాల్లో పరీక్షలు రాసేందుకు ఏర్పాట్లు పూర్తిచే సినట్లు వెల్లడించారు. ఈనెల 7 వరకు 6.32 లక్షల మంది హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నట్లు తెలిపారు. హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌లో ఏమైనా సమస్యలు తలెత్తితే హెల్ప్‌డెస్క్‌లో (040-24655555, 040-24696666, 7288896611) సంప్రదించాలని సూచించారు. అభ్యర్థులు పాటించాల్సిన నిబంధనలను తమ వెబ్సైట్ ఇప్పటికే అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.
వాటిని విద్యార్థులు మరోసారి జాగ్రత్తగా చదువుకుని పాటించాలన్నారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే పరీక్షకు హాజరయ్యే వారిని ఉదయం 9.45 గంటల వరకే అనుమతిస్తామని, మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రారంభమయ్యే పరీక్షకు హాజరయ్యే వారిని మధ్యాహ్నం 2.15 గంటల వరకే పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తామని స్పష్టం చేశారు. నిర్ణీత సమయానికి మించి నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించేది లేదని పేర్కొన్నారు. వీలైనంత ముందుగా అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు.
ఇవీ అభ్యర్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు హాల్‌టికెట్‌తోపాటు ఏదైనా ఫొటో గుర్తింపు కార్డు (పాన్ కార్డు, ఓటర్ ఐడీ కార్డు, పాస్‌పోర్టు, ఆధార్ కార్డు, డ్రైవింగ్ లెసైన్‌స, ప్రభుత్వ ఉద్యోగి అరుుతే సంస్థ ఐడీ కార్డు) తప్పనిసరిగా తెచ్చుకోవాలి. హాల్‌టికెట్‌పై ఫొటో, సంతకం సరిగా లేని అభ్యర్థులు రెండు పాస్‌పోర్టు సైజ్ ఫొటోలను తెచ్చుకోవాలి. పూర్తిస్థాయిలో తనిఖీ చేసిన తర్వాతే అభ్యర్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తారు. తనిఖీ ప్రక్రియ, బయోమెట్రిక్ విధానం ద్వారా అభ్యర్థుల చేతివేలి ముద్ర, డిజిటల్ ఫొటో తీసుకుంటారు. ఆ వివరాలను టీఎస్పీఎస్సీకి దరఖాస్తు చేసిన వివరాలతో పోల్చిచూస్తారు.
అభ్యర్థులు షూస్ వేసుకొని రావద్దు. ఆభరణాలు, గొలుసులు, చెవిపోగులు, చేతిగడియారాలు ధరించి రాకూడదు. ఎలక్టాన్రిక్ గాడ్జెట్లు, మొబైల్ఫోన్లు, ట్యాబ్‌లు, పెన్‌డ్రైవ్‌లు, బ్లూటూత్‌లు, గడియారాలు, కాలిక్యులేటర్లు, లాగ్ టేబుల్స్, చేతిబ్యాగులు, పర్సులు, నోటుపుస్తకాలు, చార్టులు, రికార్డింగ్ పరికరాల వంటివి తీసుకురావొద్దు. అభ్యర్థులు చేతులపై గోరింటాకు (మెహిందీ), ఇంక్ వంటివి ఉండకూడదు. ఓఎంఆర్ పత్రాన్ని బ్లూ లేదా బ్లాక్ బాల్‌పాయింట్ పెన్నుతోనే రాయాలి. పెన్సిల్, ఇంక్‌పెన్, జెల్‌పెన్‌తో రాసిన ఓఎంఆర్‌లను మూల్యాంకనం చేయరు.
ఇదీ షెడ్యూలు..
11న ఉదయం 10 గంటల నుంచి 12.30 గంటల వరకు.. పేపరు-1 (జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్)
11న మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు.. పేపరు-2 (హిస్టరీ, పాలిటీ అండ్ సొసైటీ)
13న ఉదయం 10 గంటల నుంచి మ ధ్యాహ్నం 12.30 గంటల వరకు... పేపరు-3 (ఎకానమీ అండ్ డెవలప్మెంట్)
13న మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు... పేపరు-4 (తెలంగాణ మూవ్మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్).