శిశుగృహకు ఆడశిశువు అప్పగింత
పెద్దవూర
మండలంలోని పర్వేదుల గ్రామ పంచాయతీ పరిధి పాత జయరాంతండాకు చెందిన రమావత్ వనిత–రాము దంపతులు ఆడశిశువును సాకలేమని శనివారం పెద్దవూర ఐసీడీఎస్ అధికారులకు అప్పగించారు. తండాకు చెందిన రమావత్ వనిత–రాము దంపతులు నిరుపేద గిరిజనులు. వీరికి రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి. కూలి పనులు చేసుకుంటూ జీవనం గడుపుతున్నారు. వీరికి మొదటి, రెండవ సంతానంగా ఆడపిల్లలే జన్మించారు. వంశాంకురం కోసం కుమారుడు కావాలని భావించి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకోలేదు. మూడవ కాన్పులోనూ వనిత గత జూన్ 6వ తేదీన మిర్యాలగూడలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఆ తర్వాత శిశువుతో సహా పాత జయరాంతండాకు వచ్చింది. పాప జన్మించిన 15 రోజులకు తన తల్లిగారింటికి వెళ్తున్నానని చెప్పి జయరాంతండా నుంచి వెళ్లింది. ఆ తర్వాత నెలన్నర రోజులకు పాపను తీసుకురాకుండా ఒక్కతే ఇంటికి చేరింది. పాప ఏమైందని చుట్టుపక్కల వారు అడిగితే చనిపోయిందని చెప్పటంతో వారికి అనుమానం వచ్చింది. విషయాన్ని స్థానిక అంగన్వాడీ కార్యకర్తకు చేరవేయడంతో వనితను నిలదీశారు. దీంతో అంగన్వాడీ కార్యకర్త పి.పద్మావతి, సూపర్వైజర్ ఎస్.వెంకాయమ్మలు విషయాన్ని సీరియస్గా తీసుకుని భార్యభర్తలకు కౌన్సిలింగ్ ఇవ్వడంతో పాపను సాకటానికి ఆర్థిక స్థోమత లేక తమ బంధువులకు సాదుకోవటానికి ఇచ్చానని చెప్పింది. దీంతో బంధువుల నుంచి శిశువును తీసుకువచ్చి సాకలేమని శనివారం స్థానిక కార్యాలయంలో గ్రామస్తుల సమక్షంలో ఐసీడీఎస్ అధికారులకు అప్పగించారు. అధికారులు శిశువును నల్లగొండ శిశుగృహకు తరలించారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్వైజర్ ఎస్.వెంకాయమ్మ, కార్యకర్త పి.పద్మావతి, గ్రామస్తులు దేవసాని శశిపాల్రెడ్డి, పాల్తీ శ్రీనునాయక్, కొంగరి రాములు, ఆయా జ్యోతి పాల్గొన్నారు.