ఈ-పాస్‌లతో ప్రతి నెల రూ.12 కోట్లు ఆదా
ఆహార సలహా సంఘం సమావేశంలో జేసీ
కర్నూలు(అగ్రికల్చర్): ప్రజా పంపిణీలో ఈ-పాస్ విధానం అమలులోకి వచ్చిన తర్వాత అక్రమాలకు అడ్డుకట్ట పడి ప్రతి నెల దాదాపు రూ.12 కోట్లు ఆదా అవుతున్నాయని జాయింట్ కలెక్టర్ సి.హరికిరణ్ తెలిపారు. శనివారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆహార సలహా సంఘం సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ ప్రతి రేషన్ షాపులో కేవలం ఈ-పాస్‌కు సంబంధించిన వేయింగ్ మిషన్ మాత్రమే ఉండాలని ఇతరత్రా ఎలాంటి వేయింగ్ మిషన్లు ఉండరాదన్నారు. అలా ఉంటే సంబంధిత సీఎస్డీటీలను బాధ్యులను చేసి చర్యలు తీసుకుంటామని వివరించారు. మొత్తం కార్డుల్లో 75 శాతం కార్డులకు మొదటి 3 రోజుల్లో సరుకులు పంపిణీ అవుతున్నాయని మిగిలిన వాటికి 15 వరకు పంపిణీ సరుకుల పంపణీ జరుగుతుందని వివరించారు. ఈ-పాస్‌ల్లో వేలి ముద్రలు పడకపోతే ఐరీస్‌ను పరిగణలోకి తీసుకోవాలని తెలిపారు.
సభ్యుల ప్రశ్నలు
► కొందరు డీలర్లు బోగస్ రేషన్ కార్డులకు ఆధార్ నెంబర్లు లింకప్ చేసి యథావిదిగా అక్రమాలకు పాల్పడుతున్నారని శనివారం ‘సాక్షి’లో ప్రచురితం అయిన కథనాన్ని ప్రస్తావిస్తూ వీటిపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని సీపీఐ నగర కార్యదర్శి రసూల్ కోరారు.
► కర్నూలులోని ఐనాక్స్ థియేటర్లో రూ.10 వస్తువును రూ.50కి అమ్ముతున్నారని బయటి నుంచి కనీసం మంచినీళ్లను కూడా అనుమతించడం లేదని దీనిపై చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్సీపీ నాయకులు తోట వెంకటకృష్ణారెడ్డి తెలిపారు.
► రేషన్ సరుకులను ప్రతి నెల 20 వరకు పంపిణీ చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యవర్గసభ్యుడు షడ్రక్ తెలిపారు.
► ప్రజా పంపిణీలో అమలుపై తీసుకోవాల్సిన చర్యలపై తీర్మానం చేయాలని మాజీ జెడ్పీ చైర్మన్ ఆకెపోగు వెంకటస్వామి డియాండ్ చేశారు. పండ్లను మాగించడంలో కార్బైడ్‌ను యథేచ్ఛగా వాడుతున్నారని దీనిపై చర్యలు తీసుకోవాలన్నారు.