టీడీపీ నేతల దౌర్జన్యాలకు బలయ్యాడు
అనంతపురం మెడికల్ : ‘స్టోర్ డీలర్ల కేటాయింపుల్లో కోర్టు ఆదేశాలు పాటించినందుకు టీడీపీ నేతలు నానా రచ్చ చేసి బజారులో కొట్టారు. ఆత్మన్యూనతకు, అభద్రతా భావానికిలోనై, శారీరకంగా, మానసికంగా కుంగిపోయి.. చికిత్స పొందుతున్న గుడిబండ తహశీల్దార్ ఎం వేణుగోపాల్‌ను ఎవరూ పట్టించుకోవడం లేద’ని ఆయన భార్య ఆదెమ్మ, కుమారుడు సాయిసాగర్ ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలోని శ్రీనివాస ఆస్పత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్న వేణుగోపాల్ పరిస్థితిని చూపిస్తూ వారు మంగళవారం వారు కన్నీటిపర్యంతమయ్యూరు.
గతేడాది డిసెంబర్ 3న ఎఫ్పీ షాపు కేటాయింపుల్లో టీడీపీకి అవకాశం రాలేదనే కారణంతో తహశీల్దార్ పట్ల టీడీపీ నేతలు చాలా దురుసుగా వ్యవహరించారని ఆరోపించారు. ఆ బాధతో ఆయన మానసికంగా కుంగిపోయి, రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారన్నారు. చివరకు కోమాలోకి వెళ్లారన్నారు. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ గ్లోబల్ ఆస్పత్రిలో చేర్పించామని, అక్కడ రూ.8 లక్షల వరకు ఖర్చు అయ్యిందని చెప్పారు.
డిశ్చార్జ్ వద్దని చెప్పినా, డబ్బులు భరించలేక ఇక్కడకు తీసుకొచ్చామన్నారు. ఇంత జరిగినా ప్రభుత్వం నుంచి కానీ, రెవెన్యూ అధికారుల నుంచి గానీ ఎటువంటి సహకారం అందలేదన్నారు. కర్టసీ కోసమైనా ఇటువైపు అధికారులు తొంగి చూడకపోవడం దారుణమన్నారు. కోర్టు నిబంధనలకనుగుణంగా పనిచేసినందుకు ఇలా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఆస్పత్రి చికిత్స కోసం ముందుకు రావాలన్నారు. తన భర్తపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదెమ్మ డిమాండ్ చేశారు.