అమెరికాలో 70 భారతీయ పాస్‌పోర్టుల చోరీ
శాన్ఫ్రాన్సిస్కోలోని ఓ ప్రైవేటు కంపెనీ నుంచి దాదాపు 70 భారతీయ పాస్‌పోర్టులను గుర్తు తెలియని దుండగులు తస్కరించారు. వీసా, పాస్‌పోర్టు సంబంధిత సేవలను ఆ కంపెనీకి భారత రాయబార కార్యాలయం ఔట్‌సోర్సింగ్‌కు ఇచ్చింది. అందుకే ఆ కంపెనీలో అన్ని పాస్‌పోర్టులున్నాయి. అంత కీలకమైన సంస్థలో భద్రతాపలమైన లోపాలు ఎందుకు ఉన్నాయనే విషయాన్ని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఈ పాస్‌పోర్టులు దుర్వినియోగం కాకుండా ఉండేందుకు భారతీయ రాయబార కార్యాలయంతో పాటు స్థానిక పోలీసులు కూడా విదేశాంగ శాఖను అప్రమత్తం చేశారు. బీఎల్ఎస్ ఇంటర్నేషనల్ అనే ఈ కంపెనీ సేవలు ఇక అవసరం లేదని భారత రాయబార కార్యాలయం తెలిపింది. కొత్త కంపెనీలను ఆహ్వానిస్తూ బిడ్లు దాఖలు చేయాలని కోరింది. చోరీకి గురైన పాస్‌పోర్టులన్నింటినీ శాన్ఫ్రాన్సిస్కోలోని భారత రాయబార కార్యాలయం రద్దుచేసింది.