ఐదేళ్ల బాలుడి కిడ్నాప్‌నకు యత్నం
ఇబ్రహీంపట్నం: ఐదేళ్ల బాలుడిని కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించి ఓ మహిళ విఫలమైంది. మంగళవారం మధ్యాహ్నం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో చోటుచేసుకున్న ఈ ఘటన కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. ఇబ్రహీంపట్నంలోని ఎంజీఆర్ కాలనీకి చెందిన అంజయ్య, పద్మ దంపతుల కుమారుడు కార్తీక్ (05) స్థానిక కృష్ణవేణి టాలెంట్ స్కూలులో ఎల్కేజీ చదువుతున్నారు.
సాయంత్రం పాఠశాల ముగిసిన అనంతరం ఇబ్రహీంపట్నంకే చెందిన ఓ పాస్టర్ కూతురు ఆశ.. బాలుడి తల్లిదండ్రుల పేరు చెప్పి కార్తీక్‌ను తన వెంట తీసుకెళ్లింది. బాలుడిని తీసుకెళ్లిన కాసేపటికే తల్లి పద్మ పాఠశాలకు వచ్చి బాలుడి కోసం ఆరా తీయగా విషయం బయటపడింది. అయితే కాసేపటికే స్థానిక పాతబస్టాండ్ సమీపంలో ఓ మహిళ వద్ద ఉన్న కార్తీక్‌ను అదే పాఠశాలలో చదివే పదో తరగతి విద్యార్థి కళ్యాణ్ గమనించారు. కార్తీక్‌ను పట్టుకున్న మహిళ వద్దకు వెళ్తుండగానే ఆమె అక్కన్నుంచి జారుకుంది. దీంతో కళ్యాణ్.. కార్తీక్‌ను పాఠశాల వద్దకు తీసుకురావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. బస్టాండ్‌లో ఉన్న ప్రయాణికులు, కళ్యాణ్ నుంచి వివరాలు సేకరించిన పోలీసులు కిడ్నాప్‌కు పాల్పడిన మహిళను ఆశగా గుర్తించారు.