జడ్జిపై సెల్‌ఫోన్ విసిరిన మహిళ
తన బంధువులకు విధించిన బెయిల్ రద్దు చేయాలని ఓ మహిళ పాట్నా సివిల్ కోర్టును ఆశ్రయించింది. అందులోభాగంగా కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అందుకు గత వారం రోజులుగా కోర్టు చుట్టు చెప్పులు అరిగేలా తిరిగింది. చివరకు శుక్రవారం ఆ కేసు విచారణకు వచ్చింది. అయితే ఆ కేసును పాట్నా జిల్లా జడ్జి బీరేంద్ర కుమార్ కొట్టివేశారు. అంతే ఆ మహిళ ఆగ్రహం కట్టలు తెంచుకుంది. తన వద్ద ఉన్న సెల్‌ఫోన్ జడ్జిపైకి విసిరింది. ఆ సెల్‌ఫోన్ కాస్తా ఆయన ముందు పడింది.
దాంతో కోర్టు హాల్లో ఉన్నవారంతా ఏం జరుగుతుందో అర్థం కాక నిలుచుండిపోయారు. అంతలో అక్కడే ఉన్న పోలీసులు తేరుకుని ఆ మహిళను అదుపులోకి తీసుకున్నారు. సదరు మహిళ పేరు రీటా సింగ్ అని, శరణ్ జిల్లా సోనిపూర్ ఆమె స్వస్థలమని పోలీసులు వెల్లడించారు. కోర్టులో అమర్యాదగా ప్రవర్తించిన రీటా సింగ్‌పై పోలీసులు కేసు నమోదు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. అనంతరం ఆమెను జైలుకు తరలించారు.