వందేళ్ల కవలలు
బెల్జియం : నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో బతకాలని అందరూ కోరుకుంటారు. కాని మారుతున్న ఆహారపు అలవాట్లు, దానికి తోడు రకరకాల రోగాలు, కాలుష్యం వంటి కారణాలతో మనిషి జీవిత కాలం రానురానూ తగ్గిపోతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో 60 ఏళ్లు బతకడమే గగనమవుతోంది. అలాంటిది 100 ఏళ్లు బతకడమంటేనే ఆశ్చర్యం. కాని బెల్జియంకు చెందిన పీటర్, పౌలస్ లాంగ్రాక్ అనే ఇద్దరు కవల సోదరులు 103వ పడిలోకి అడుగుపెట్టారు.
రెండు సంవత్సరాల్లో వీరు 105 ఏళ్లు బతికిన అమెరికాకు చెందిన కవల సోదరులు గ్లెన్, డేల్ మోయర్ రికార్డును బద్దలుగొట్టి, ప్రపంచంలోనే ఎక్కువ సంవత్సరాలు బతికిన కవలలుగా అవతరించబోతున్నారు. ఇప్పటికీ వారు ఒకరినొకరు వదిలి ఉండలేరు. అందుకే అన్నదమ్ములు పెళ్లి కూడా చేసుకోలేదు. వారు తమ పుట్టిన రోజును వారుండే నర్సింగ్ హోంలోనే ఆనందంగా జరుపుకున్నారు. వారి 103 ఏళ్ల అనుబంధాన్ని చూసి అన్నదమ్ములెవరైనా అసూయ పడాల్సిందే.