ఈ ఘనత మాదే
కృష్ణా–గోదావరి సంగమంపై సీఎం చంద్రబాబు
నదీమ తల్లులకు ప్రత్యేక పూజలు
నవ హారతి సభకు వచ్చేందుకు నిరాకరించిన డ్వాక్రా మహిళలు
ఇంజినీరింగ్ విద్యార్థుల తరలింపు
ముఖ్యమంత్రి రాక ఆలస్యంతో వారూ జంప్
ఇబ్రహీంపట్నం :
కృష్ణా,గోదావరి నదుల అనుసంధాన ప్రాంతంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో సంగమ ప్రాంతానికి చేరుకున్న ఆయన తొలుత పుష్కర ఘాట్లను పరిశీలించారు. అనంతరం నదీమ తల్లులకు పసుపు కుంకుమతో ప్రత్యేక పూజలు చేశారు. వేదపండితుల మంత్రోచ్ఛరణల నడుమ నవ హారతి ఇచ్చారు. అనంతరం సభావేదిక వద్దకు చేరుకుని మాట్లాడుతూ రాష్ట్రంలో రెండు జీవనదులను కలిపిన ఘనత ఈ ప్రభుత్వానికి దక్కుతుందని తెలిపారు. బ్రిటీష్ కాలంలో సర్ ఆర్థర్ కాటన్ దొర రాష్ట్రంలో ప్రాజెక్టులు నిర్మించటం వల్ల రాష్ట్రం సస్యశ్యామలం అయిందన్నారు. తూర్పు, పశ్చిమ గోదావరిలో ఆయన ఫొటోలు విగ్రహాలకు పూజలు చేస్తున్నారన్నారు. జిల్లాలో ప్రధాన కాలువలకు 12వేల క్యూసెక్కులు విడుదల చేశామన్నారు. రాష్ట్రంలో నదులన్నీ అనుసంధానం చేసేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లనున్నట్లు తెలిపారు. ఒకప్పుడు కరువును చూసి భయపడేవారమని ఇప్పుడు నదుల అనుసంధానంతో కరువు భయపడాలన్నారు.
పొగడ్తలతో...
ఇదిలా ఉంటే జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, గృహనిర్మాణ కార్పొషన్ చైర్మన్ వర్ల రామయ్య, మరో మంత్రి కొల్లు రవీంద్ర, డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్, ఎంపీ కేశినేని నానిలు సీఎం చంద్రబాబును అపర భగీరథుడు, సర్ ఆర్థర్ కాటన్‌తో పోల్చారు. ప్రపంచంలో ఏ ముఖ్యమంత్రి చేయలేనటువంటి అభివృద్ధి పనులు చేస్తున్నారని పొగడ్తలతో ముంచెత్తారు. కాటన్ మాదిరిగా చంద్రబాబు ఫొటోలను రైతులు తమ ఇళ్లల్లో పెట్టుకోవాలని సూచించారు.
సీఎం సభకు కళాశాల విద్యార్థులు
ఉదయం 11 గంటలకు సీఎం సమావేశమని డ్వాక్రా మహిళలను ఆటోలు, బస్సుల్లో తరలించేందుకు ప్రయత్నించారు. సోమవారం సీఎం సభకు తరలివచ్చిన మహిళలు సభవాయిదా పడడంతో అవస్థలు పడ్డారు. దీంతో పలు గ్రామాల్లో మహిళలు మంగళవారం సీఎం సభకు వచ్చేందుకు నిరాకరించారు. దీంతో ఇబ్రహీంపట్నం, కంచికచర్ల, జి.కొండూరు ప్రాంతాల్లోని నిమ్రా, నోవా, మిక్, అమృతసాయి, జాకీర్‌హుసేన్ వంటి పలు జూనియర్, ఇంజినీరింగ్ కళాశాలల విద్యార్థులను సభకు తరలించారు. సమావేశం రెండు గంటల ఆలస్యంగా ప్రారంభం కావడంతో సీఎం రాకముందే విద్యార్థులు వెళ్లిపోవటం కనిపించింది. బ్యాగులు, టిఫిన్‌బాక్స్‌లు కళాశాలలో వదిలి రావడంతో మధ్యాహ్నం భోజనం సమయం దాటిపోయి విద్యార్థులు ఆకలితో అలమటించారు. విద్యార్థులతో పాటు మహిళలు వేదిక నుంచి బయటకు వెళ్లారు. సీఎం ప్రసంగం ప్రారంభం కాకముందే కుర్చీలు ఖాళీ అయ్యాయి. సీఎం మాట్లాడుతున్న సమయంలో కూడా మహిళలు భారీగానే బయటకు తరలివెళ్లారు. కేవలం 500 మంది ముందు వరుసలో కూర్చున్న వారినుద్దేశించి సీఎం చంద్రబాబు 30 నిమిషాలు పాటు వివిధ అంశాలపై మాట్లాడారు. పుష్కరఘాట్లు పరిశీలించేందుకు వచ్చిన సీఎం పుష్కరాల పనులు అసంపూర్తిగా మిగి లినప్పటికీ వాటిపై కనీసం స్పందించక పోవటం గమనార్హం.