'ఆయన' తహ తహ..తహశీల్దార్!
రెవెన్యూ కార్యాలయమే వడ్డీ వసూళ్ల కేంద్రం!
రూ.2 కోట్లు టర్నోవర్?
అధికార పార్టీ నేతలే బాధితులు
తిరుపతి : ఆయనో మండల తహశీల్దార్. అటెండర్ స్థాయి నుంచి ఉన్నతస్థాయికి ఎదిగారు. తహశీల్దార్గా ఉద్యోగోన్నతి పొందాక ఆయన ఆహార్యం మారింది. తన చేతులకున్న పదివేళ్లలో ఏడు వేళ్లకు పెద్దసైజు ఉంగరాలు, మెడలో భారీగా బంగారు గొలుసులు వేసుకుని ఫైనాన్స్ వ్యాపారిగా కనిపిస్తుంటాడు. ఆయన అసలు వ్యవహారం కూడా అదే! వడ్డీ వ్యాపారానికి తెరతీసి ప్రభుత్వ కార్యాలయాన్నే వసూళ్ల కేంద్రంగా మార్చుకున్నాడు. వ్యవహారంలో ఇతర వడ్డీ వ్యాపారులకేమీ తీసిపోడు. ఇప్పుడు అత్తగారి మండలంలోనే విధులు నిర్వర్తిస్తూ ‘మూడు చెక్కులు ఆరు ప్రామిసరీ నోట్లు’గా వడ్డీ వ్యాపార సామ్రాజ్యాన్ని ఏలుతున్నాడు.
చంద్రగిరి నియోజకవర్గంలోని ఓ మండలంలో తహశీల్దార్ కాల్మనీని తలపించేలా దందా నడిపిస్తున్న తీరు చూసి అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. మెక్రోఫైనాన్స్ను తలదన్నేలా జలగల్లా పీక్కుతింటున్నట్లు చెబుతున్నారు. అవసరాలను ఆసరాగా చూసుకుని అధికవడ్డీలతో అప్పుల వల వేస్తాడు. అప్పు ఇచ్చిన సాకుతో బయటకు చెప్పుకోలేని విధంగా యాతనపెడతాడు. మధ్య తరగతి ప్రజలతో పాటు పలువురు వ్యాపారులు ఈయన చేతికి చిక్కుతున్నారు.
డైలీ, వారం, నెల వారిగా ఫైనాన్స్ ఇస్తున్నారు. నూటికి రూ.10, అంతకంటే ఎక్కువకు కూడా వడ్డీని ముక్కుపిండి వసూలు చేస్తాడని చెబుతున్నారు. కొందరు అప్పులు కట్టలేక ఆస్తులను ఆయనకు వదిలేసినవారు కూడా ఉన్నట్లు సమాచారం. ఆయన డాబు, దర్పం చూసి పలువురు బాధితులు బయటపడి చెప్పలేక లోలోన వేదన పడుతున్నారు. దాదాపు 70 మందికి ఆయన దాదాపు రెండు కోట్ల రూపాయలకు పైగా వడ్డీలకు ఇచ్చినట్లు సమాచారం. కాగా, సదరు అధికారి ముందుచూపుతో కొందరు అధికార పార్టీ నాయకులను తన కస్టమర్లుగా మార్చుకున్నాడని తెలుస్తోంది.
వారిని తనకు రక్షణ కవచంగా ఉపయోగించుకుంటూ, నిబంధనలకు విరుద్ధంగా వారికి పనులు చే సి పెడుతున్నట్లు టీడీపీ నాయకులే కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఇదే విషయాన్ని పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఓ ఉద్యోగి సైతం చెప్పారు.
వడ్డీకి అప్పు తీసుకున్న వారితో సెటిల్మెంట్ వ్యవహారాలన్నీ తన కార్యాలయంలోనే సాయంత్రం 6 నుంచి రాత్రి 11గంటల వరకు ఆయన చక్కబెడుతుంటారని అక్కడి సిబ్బంది ఆరోపిస్తున్నారు. ఆయన మొదటి భార్య చనిపోవడంతో రెండో భార్య కోసం పాకాలలోనూ, పూతలపట్టు మండలంలో అనధికారికంగా ఉన్న మూడో భార్య కోసం ఇళ్లలో కాపురం పెట్టాడని.. ఆయా ఇళ్లు సైతం వడ్డీబాధితులవేనని తీవ్రమైన ఆరోపణలున్నాయి. కాగా, ఇలా వడ్డీ దందాతో వచ్చిన డబ్బులతోనే రాజకీయంగా ఎదగాలని ఆ తహశీల్దార్ తహతహలాడుతున్నట్లు సమాచారం.
డీకేటీ పట్టాలు సైతం..
పేదలకు దక్కాల్సిన ప్రభుత్వ భూములను సదరు తహశీల్దార్ గద్దలా తన్నుకుపోతున్నాడనే విమర్శలు వస్తున్నాయి. ఆర్ఐగా, డెప్యూటీ తహశీల్దార్గా, తహశీల్దార్గా పనిచేసిన ఈయన తన భార్య పేరుతో నేండ్రగుంట-పెనుమూరు రోడ్డులో ఐదు ఎకరాల భూమికి డీకేటీ పట్టా తీసుకున్నాడు. విమర్శలు వెల్లువెత్తడంతో తన భార్య పేరు నుంచి కుటుంబ సభ్యుల పేరుతో డీకేటీ పట్టాను మార్చుకున్నాడు. ఏదేమైనా ఇప్పటికైనా ఉన్నతాధికారులు ఇలాంటివారిపై దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు.