కోటాలో కోత.. రైతులకు వాత
- ఏనాడూ పూర్తి కోటా నీటికి నోచుకోని పీబీసీ
- ఈ ఏడాది సాగునీరివ్వలేమని తేల్చి చెప్పిన అధికారులు
- తాగునీటి అవసరాలకూ పూర్తి స్థాయిలో కేటాయించని వైనం
- 2.955 టీఎంసీలు అవసరమైతే కేటాయించింది 2 టీఎంసీలే
- ప్రవాహ, ఆవిరి నష్టాలు పోగా చేరేది ఒక టీఎంసీనే
సాక్షి, కడప : తుంగభద్ర ప్రాజెక్టులో తగినంత నీరు నిల్వలేదని చెబుతూ అధికారులు పీబీసీ కోటాకు కోత పెట్టడం రైతులు, ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. సాగునీరివ్వలేమని ఇటీవల అనంతపురంలో నిర్వహించిన ఐఏబీ సమావేశంలో అధికారులు తేల్చి చెప్పడంతో ఆయకట్టు రైతుల ఆశలు ఆవిరయ్యాయి. తాగునీటికి కూడా పూర్తి స్థాయిలో కేటాయించ క పోవడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మిడ్పెన్నార్ నుంచి కాకుండా, తుంపెర డీప్ కట్ వద్ద పీబీసీకి విడుదలయ్యే నీటిని లెక్కలోకి తీసుకోవాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం పీబీసీకికేటాయించిన రెండు టీఎంసీల్లో.. ప్రవాహ, ఆవిరి నష్టాలు పోనూ చేరేది ఒక టీఎంసీనే అని అధికారులు అంచనా వేస్తున్నారు.
చిత్రావతిలో భారీగా తాగునీటి పథకాలు
చిత్రావతి రిజర్వాయర్లో నీరు ఉన్నా పులివెందులకు సక్రమంగా అందని పరిస్థితి నెలకొంది. అనంతపురం జిల్లాలోని ధర్మవరం అర్బన్, రూరల్, పుట్టపర్తి మున్సిపాలిటీ, కదిరి మున్సిపాలిటితోపాటు వందలాది గ్రామాలకు ఇక్కడి నుంచే నీటిని అందిస్తున్నారు. పులివెందుల నియోజకవర్గంలోని 177 గ్రామాల్లోని తాగునీటి పథకానికి నీరందిస్తున్నారు.
అయితే పులివెందుల మున్సిపాలిటీకి వచ్చే సరికి సమస్య ఏర్పడుతోంది. ఈసారి అలా కాకుండా తుంగభద్ర నీరు చిత్రావతికి చేరుకోగానే నక్కలపల్లె సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుకు విడుదల చేస్తే కోంతైనా సమస్య తగ్గుతుందని మున్సిపల్ అధికారులు అంచనా వేస్తున్నారు. మొత్తం పథకాలకు 2.955 టీఎంసీలు అవసరమైతే రెండు టీఎంసీలు మాత్రమే కేటాయించారు. ఇందులో సగం నీరు మాత్రమే అందుబాటులోకి వస్తుంది. ఈ కొద్ది నీటితో అవసరాలు ఎలా తీర్చాలని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సగానికి సగం నీటిని కోల్పోతున్న పీబీసీ
పులివెందుల బ్రాంచ్ కెనాల్ ప్రతి ఏడాది తుంగభద్ర నీటిని 40 శాతం కోల్పోవాల్సి వస్తోందని సాగు నీటి శాఖ రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. తుంపెర డీప్ కట్ వద్ద రీడింగ్ మీటర్ ఏటవాలుగా ఉండటం, అనంతపురం జిల్లాలోని కాలువ వెంబడి వందల సంఖ్యలో అక్రమ మోటార్లు పెట్టి నీటిని తోడేస్తున్న పలితంగా సుమారు 10 శాతం మేర నీరు వృధా అవుతోంది.
కేటాయించిన నీటిని మిడ్పెన్నార్ నుంచి ఒకేసారి కాకుండా పలు దఫాలుగా విడుదల చేయడం వల్ల మరింత నష్టం కలుగుతోంది. ‘ప్రస్తుత పరిస్థితిలో సాగునీటికి ఇబ్బందే. అక్టోబర్లో అనంతపురంలో రెండవ సారి నిర్వహించే ఐఏబీ సమావేశంలో సాగునీటిపై నిర్ణయం తీసుకుంటాం. ఇప్పుడు కేటాయించిన నీరు తాగునీటికే సరిపోతుంది. తుంగభద్ర డ్యాంలో నీటి నిల్వను బట్టి కేటాయింపులో మార్పు ఉంటుంద’ని పీబీసీ ఈఈ మురళీ కృష్ణ తెలిపారు.