'సీఎం ఆఫీసు కిరాణా కొట్టు కంటే అధ్వాన్నం'
- లోకేష్ కనుసన్నల్లో సీఎంవో కార్యాలయం
- ఏ అర్హతలు లేకున్నా 'అభీష్ట'ను ఓఎస్డీగా నియమించారు
- లోకేష్ స్నేహితుడవడమే ఆయనకున్న అర్హత
- బహిరంగ చర్చకు సిద్ధమని సవాలు
హైదరాబాద్ : చంద్రబాబు అధికారంలోకి వచ్చాక సీఎం కార్యాలయాన్ని కిరాణా కొట్టు కంటే అధ్వాన్నంగా తయారుచేశారని పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరా రెడ్డి దుయ్యబట్టారు. గురువారం ఇందిరా భవన్లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. చంద్రబాబు కుమారుడు లోకేష్ తన స్నేహితుడైన అభీష్టకు ఎలాంటి అర్హతలు లేకున్నా అక్రమ పద్ధతుల్లో సీఎం కార్యాలయంలో ఓఎస్డీగా నియమించడాన్ని తప్పుబట్టారు. అభీష్ట నియామకం ప్రభుత్వపరంగా జరగలేదని ఒకసారి, అధికారికంగానే నియమించామంటూ మరోసారి సీఎం కార్యాలయం నుంచే వెల్లడించడం శోచనీయమన్నారు.
ఆంధ్రప్రదేశ్ సచివాలయ నిబంధనల ప్రకారం ప్రైవేటు వ్యక్తులకు ప్రభుత్వ అధికారిక బాధ్యతలు అప్పగించకూడదనే నిబంధనలున్నా పట్టించుకోకుండా అభీష్టను ఓఎస్డీగా నియమించి ఐటీ, ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, ఇ-గవర్నెన్స్, ఏపీఎస్ఆర్ఏసీల బాధ్యతలను అప్పగించారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అనుబంధ విభాగం సేకరించిన సమాచారం మేరకు అభీష్టను సీఎం ఓఎస్డీగా నియమించలేదని తెలియజేస్తూ సమాచార విభాగం అసిస్టెంట్ సెక్రటరీ అధికారికంగా తెలియజేశారన్నారు. దీని ఆధారంగానే లోకేష్, ఆయన అనుచరులు కొందరు రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్నారని ఆరోపించిన అనంతరం సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులకు అనుగుణంగానే చంద్రబాబు ఓఎస్డీగా నియమించినట్లు ఆ శాఖ కార్యదర్శి ముఖేష్‌కుమార్ మీనా పేరిట సీఎంవో ప్రకటన జారీ చేసిందన్నారు.
సమాచార హక్కు చట్టం ద్వారా ఇచ్చిన సమాచారం నిజమా లేదా గురువారం ముఖేష్‌కుమార్ మీనా పేరిట సీఎంవో ఆఫీస్ వెలువరించిన ప్రకటన వాస్తవమా అనేది సమగ్ర దర్యాప్తునకు ఆదేశించాలని ఆయన డిమాండ్ చేశారు. ఎవరిచ్చిన సమాచారం వాస్తవమో నిగ్గు తేల్చేందుకు సంబంధిత ఫైళ్లను అఖిలపక్షం ఏర్పాటు చేసి అందరి ముందూ బహిర్గత పరచాలన్నారు. లేదా వాటిపై బహిరంగ చర్చకు రావాలని ఆయన సవాల్ విసిరారు. అభీష్టతోపాటు మరికొందరు లోకేష్‌కు బినామీలుగా పని చేస్తూ ప్రైవేట్ కంపెనీల పేరిట ప్రభుత్వ సొమ్మును తమ ఖాతాల్లో వేసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తమ వద్ద ఆధారాలున్నాయని, వాటిని త్వరలోనే బహిర్గతం చేస్తామని వెల్లడించారు.
ఇటీవల రాజధాని శంకుస్థాపన కార్యక్రమం కూడా అభీష్ట కనుసన్నల్లో నడుస్తున్న ఒక ప్రైవేట్ కంపెనీ ప్రభుత్వ కార్యక్రమాలను ప్రచార మాధ్యమాలకు లైవ్ ప్రోగ్రాం ఇచ్చేందుకు కాంట్రాక్టు తీసుకుందని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ సొమ్మును అక్రమంగా దోచుకునేందుకేనా మీకు ప్రజలు ఓట్లు వేసి గెలిపించిందని రఘువీరా ప్రశ్నించారు. సమావేశంలో పీసీసీ ఉపాధ్యక్షుడు ఆనం వివేకానందరెడ్డి, ప్రధాన కార్యదర్శులు గిడుగు రుద్రరాజు, జంగా గౌతం, అధికార ప్రతినిధులు గంగా భవాని, ఎన్.తులసిరెడ్డి, వేణుగోపాల్, ఆర్టీ సెల్ చైర్మన్ పి.లక్ష్మీనారాయణ, కిసాన్ సెల్ చైర్మన్ రవిచంద్రారెడ్డిలు పాల్గొన్నారు.