మధ్యతరగతి నుంచి.. ఉన్నతస్థాయికి
కష్టం వస్తే.. ముందుకు సాగకుండా.. ఉన్నంతలో సర్దుకోవాలని భావించేవారు చాలామంది ఉంటారు.. ఇబ్బందులు అధిగమించి.. లక్ష్యాన్ని సాధించాలనే పట్టుదలతో ముందుకు సాగేది కొందరే.. అటువంటి వ్యక్తుల్లో డీఆర్డీఏ పీడీ చంద్రశేఖర్‌రెడ్డి ఒకరు. వ్యవసాయ కుటుంబానికి చెందిన ఆయన ఈ జిల్లాలోనే పుట్టిపెరిగి.. సర్కారు బడుల్లో చదివి జిల్లాస్థాయి ఉన్నతాధి కారిగా ఎదిగారు. పేదల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తున్నారు. ఉప్పునుంతలకు చెందిన తనకు ఈ జిల్లా అభివృద్ధిలో పాలుపంచుకునే అవకాశం కలగడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. తన లక్ష్యాన్ని చేరుకున్న విధానం ఆయన మాటల్లోనే...!
‘మా నాన్న జంగిరెడ్డి, అమ్మ రామచంద్రమ్మ.. మాది వ్యవసాయ కుటుంబం. మాది పాలమూరు జిల్లాలోని ఉప్పునుంతల. మా కుటుంబం వ్యవసాయ కుటుంబం కావడంతో ఉప్పునుంతలలోనే ఒకటో తరగతి నుంచి పదోతరగతి వరకు సర్కారు బడిలో చదువుకున్నాను. ఉప్పునుంతలలోని మా పాఠశాలలో పదో తరగతి మొదటి బ్యాచ్ (1983లో) మాదే. అక్కడ పదో తరగతి పూర్తయ్యాక జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూని యర్ కళాశాలలో ఇంటర్ పూర్తి చేశాను. ఆ తర్వాత ప్రభుత్వ ఎంవీఎస్ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశాను. ఉన్నత చదువుల కోసం ఉస్మానియా యూనివ ర్సిటీకి వెళ్లాల్సి వచ్చింది’.
ఊహించని సందర్భాలు
‘రాష్ట్రస్థాయి రెండో ర్యాంకు సాధించి, పీజీ లో చేరిన తర్వాత ఎంవీఎస్ కళాశాల అధ్యాపకులు డిగ్రీలో చేరినవిద్యార్థుల్లో స్ఫూర్తిని కలిగించే విధంగా నాతో అవగాహన కార్యక్రమం నిర్వహించడం నేను ఊహించలేదు. రెండుసార్లు మెయిన్స్ పరీక్షలకు ఎంపికయ్యాను. ఉద్యోగాల వేటలో భాగంగా ఎస్ఐగా ఎంపికై కొద్దిరోజులు శిక్షణలో పాల్గొని తిరిగి వచ్చాను. గిరిజన కార్పొరేషన్ కన్సల్టెంట్‌గా కూడా ఉద్యోగం వచ్చింది. అయినప్పటికీ.. సంతృప్తి కలగక అదీ మానేశాను. 1996 ఏపీపీఎస్సీ ఎంపికల్లో పాల్గొని జిల్లాస్థాయి అధికారిగా ఉద్యోగావకాశం పొందగలిగాను. ఏదో ఒక ఉద్యోగం వస్తేచాలని అనుకున్నప్పటికీ.. వాటిలో తృప్తి చెందని కారణంగానే జిల్లాస్థాయి అధికారిగా అవకాశాన్ని దక్కించుకోగలిగాను. డీఆర్డీఏ పీడీగా మెదక్ జిల్లాలో పనిచేశాను. ఆ తర్వా సొంత జిల్లాకు రావడం.. వచ్చిన తర్వాత అధికారిక హోదాలో ఉప్పునుంతల మండలంలో పర్యటించే రోజు వస్తుందని ముందుగా ఎన్నడూ ఊహించలేదు’.
ఆనంద క్షణాలు
డీఆర్డీఏ, ఐకేపీ ద్వారా పేద కు టుంబాలకు చెందిన మహిళల పురోగతికి, వారు ఆర్థికంగా ఎదిగేందుకు ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టి, అవి విజయవంతమయ్యేలా మా బృం దంతో కలిసి పనిచేసే ప్రతి క్షణం ఆనందంగా ఉంది. ఐకేపీ ద్వారా జరిపిన సర్వేలో భాగంగా జిల్లాలో 76వేలమంది కిశోర బాలికలు ఉన్నట్లు గుర్తించాం. అందులో 16వేల మంది బాలికలు బడి ముఖం చూడని వారున్నట్లు తేలింది. వారిలో దాదాపు 1200 మందిని ఎంపిక చేసి ఓపెన్ స్కూల్ విధానం ద్వారా పదో తరగతి పరీక్షలు రాయించాం. అందులో ఆసక్తి ఉన్న బాలికలకు ప్రత్యేక శిక్షణ ఇప్పించి ఉపాధి కల్పించగలగడం ఎంతో ఆనందం కలిగించింది. గ్రామాల్లో ఆకలితో అలమటించే పేదలకు పట్టెడన్నం పెట్టించాలన్న సంకల్పంతో ‘పిరికెడు బియ్యం’ అనే కాన్సెప్ట్‌తో మహిళా సంఘాల సభ్యు లు రోజూ పిరికెడు బియ్యం వాళ్ల ఇళ్లల్లోనే పక్కన తీసిపెట్టి వారి నెలవారి సమావేశం నాడు మహిళలందరూ ఒక్కచోట చేరినపుడు ఆ బియ్యం మొత్తాన్ని పేదవారికి అందించే విధంగా ఈ కార్యక్రమం చేపట్టాం.
టర్నింగ్ పాయింట్
‘మహబూబ్‌నగర్‌లోని ఎంవీఎస్ కాలేజీ లో డిగ్రీ రెండో సంవత్సరంలో ఉన్నపుడే ఎం ఎస్సీ బాటనీలో చేరేందుకు ఎంట్రె న్స్ రాసి అర్హత పొందాను. డిగ్రీ పూర్తయ్యాక ఎంట్రె న్స్ రాస్తే తప్పకుండా సీటు వస్తుందని అప్పు డు నాతోటి విద్యార్థులు, సీనియర్ విద్యార్థులు నన్ను ఎంతో ప్రోత్సహించడంతో డిగ్రీ చివరి సంవత్సరంలో ఎంట్రెన్స్ రాస్తే పీజీ ఎంట్రెన్స్‌లో రాష్ట్రస్థాయి రెండో ర్యాంకు దక్కింది. అదే నా జీవితంలో టర్నింగ్ పాయింట్ అయింది. ఉద్యోగం వచ్చే వరకు యూనివర్సిటీని వీడలేదు’.
సాధించాల్సినవి..
జిల్లా నుంచి వలసలు తగ్గిం చేందుకు మా శాఖ తరఫున ఆయా పథకాలు పూర్తిస్థాయిలో పేదలకు అందించాలన్నది నా లక్ష్యం.
నిరుద్యోగులకు అధికసంఖ్యలో ఉపాధి,ఉద్యోగాలుకల్పించాలని ఉంది.
సామాజిక రుగ్మతలను రూపుమాపి అక్షరాస్యతలో ముందుకు నడిచేలా నా వంతు కృషి చేస్తాను.