ఉగ్రవాద నిర్మూలన, శాంతి పరిరక్షణ
ఐరాస సమావేశంలో భారత్ ప్రాధాన్యాలు
ఐక్యరాజ్య సమితి: భద్రతా మండలిలో సత్వర సంస్కరణలు, ఉగ్రవాద నిర్మూలన, శాంతి పరిరక్షణ పంటి ప్రధాన అంశాలను ఐక్యరాజ్యసమితి 69వ సర్వసభ్య మండలి సమావేశాల్లో భారత్ ప్రధానంగా ప్రస్తావించనుంది. 193 దేశాలతో కూడిన ఐక్యరాజ్య సమితి సర్వసభ్య మండలి సమావేశాలు బుధవారంనుంచి వచ్చే నెల 8 వరకూ జరగనున్నాయి. ఈ సమావేశాల్లో భారత ప్రతినిధి బృందం ప్రస్తావించబోయే వివిధ అంశాలను ఐక్యరాజ్యసమితి భారత రాయబారి అశోక్ మఖర్జీ వివరించారు.
గతంలో ఎనిమిది దఫాలుగా జరిగిన చర్చలతో భద్రతా మండలి సంస్కరణలపై అవసరమైన సమాచారం అందుబాటులోకి వచ్చిందని, ఈ చర్చల ప్రాతిపదికగానే, సంస్కరణలపై వచ్చే నవంబర్లో ప్రభుత్వాల మధ్య చర్చలు జరపాలని భారత్ కోరుకుంటున్నట్టు చెప్పారు. అంతర్జాతీయ ఉగ్రవాదంపై సమగ్ర చట్టం ముసాయిదాను ఖరారు చేయించేందుకు కూడా భారత్ కృషిచేస్తుందన్నారు. అల్కాయిదా, తాలిబన్ ఉగ్రవాద సంస్థలను భద్రతా మండలి ఆంక్షల కమిటీల జాబితాలో చేర్చేందుకు భారత్ చొరవ తీసుకుంటుందన్నారు.