నెమలికి ప్రాణం పోశారు..
జిన్నారం (మెదక్): గాయపడి చావు బతుకుల మద్య ఉన్న జాతీయపక్షి నెమలికి ప్రాణంపోసి సురక్షిత ప్రాంతానికి తరలించిన యువకులకు ప్రశంసలు లభించాయి. మెదక్ జిల్లా జిన్నారం మండలం సోలక్పల్లి గ్రామంలో చోటుచేసుకున్న ఈ సంఘటన వివరాల్లోకి వెళితే..
బుధవారం ఉదయం గ్రామసమీపంలోని పొలాల్లోకి వెళ్లిన యువకులకు ఒక నెమలి కనిపించింది. అది ఎంతకూ కదలకపోయేసరికి దగ్గరికి వెళ్లి పరిశీలించగా, రెక్కుల వెనుక భాగంలో రక్తం కారుతుండటాన్ని గమనించారు. వెంటనే ఆ నెమలిని గ్రామంలోకి తీసుకొచ్చి ప్రాథమిక చికత్స చేశారు. అటవీశాఖ అధికారులను సంప్రదించేందుకు ప్రయత్నించగా అందుబాటులోకి రాకపోవడంతో నెమలిని జిన్నారం పోలీస్ స్టేషన్లో అప్పగించారు. నెమలిని కాపాడిన రవికుమార్, కుర్మ శ్రీనివాస్, ప్రదీప్, భూపాల్, శేఖర్ లను పలువురు అభినందించారు.