మేమంతా పెక్యుడియర్
ఓ కథ
‘‘పాగల్గాని లెక్కున్నడు. బస్తీల పేర్లుగూడ సక్కగ చెప్పనీకి రాట్లే’’ అనుకున్నాడు ఆటోడ్రైవర్.
‘‘పిచ్చోడు. మన సిటీలోని ఏరియాల పేర్లను ఇంకేదో పేర్లతో పిలుస్తున్నాడు’’ అనుకున్నాడు తిరుగేశ్. అటు ఆటోడ్రైవరూ, ఇటు తిరుగేశూ... ఇద్దరూ ఒకే క్షణంలో ఇలా అనుకోడానికి ఓ కారణముంది. ‘‘మేపుల్టన్ వస్తావా?’’ అడిగాడు తిరుగేశ్ ఆటోవాణ్ణి. ‘‘ఏందీ... మెహ్దీపట్నమా?’’ కన్ఫర్మ్ చేసుకోడానికి అన్నట్టుగా అడిగాడు ఆటోవాలా. నోరు తిరగక ఏదో అన్నాడేమో అన్నట్టుగా చూస్తూ, ‘ఆ’ అనేస్తూ తిరుగేశ్ ఆటోఎక్కాడు. అక్కడ దిగి, ఇంటర్నేషనల్ ఫ్రూట్‌జ్యూస్ సెంటర్లో ఫ్రూట్సలాడ్ తిని, మరో ఆటోను ఆపాడు.
‘‘మారిసోనియా చల్తే?’’
‘‘ఏందీ... మూసారంబాగా?’’ అన్నాడు ఆటోడ్రైవర్.
మళ్లీ ఆ... అంటూ ఆటో ఎక్కి మూసారంబాగ్లో దిగాడు.
సరిగ్గా అక్కడ దిగగానే ఆటోవాలా అతణ్ణి ‘పాగల్గాడ’నీ, తిరుగేశ్ ఆటోడ్రైవర్‌ను ‘పిచ్చోడ’నీ అనేసుకున్నారు.
ఇలా ఆ ఇద్దరూ అనుకోడానికి ఓ కారణం ఉంది.
ఆ కారణం పేరే... రీడూప్లికేటివ్ పారామ్నీషియా!
ఇంజనీరింగ్ పూర్తయ్యాక మన తిరుగేశ్ కూడా తన పేరుకు తగ్గట్లుగా గాలికి తిరుగుతూ ఉండేవాడు. ‘‘వైటూకే రోజుల్లో నీలాగే గాలికి తిరుగుతుండేవాళ్లందరూ ఏదో ఓ కంప్యూటర్ ప్రోగ్రామ్ నేర్చుకుని అమెరికా వెళ్లి బాగా సంపాదించారు. నువ్వూ ఆ పని చేయకూడదూ’’ అంటూ సలహా ఇచ్చాడు తండ్రి.
అంతే... తాను శాప్గానీ... పైథాన్గానీ నేర్చుకుని అమెరికా వెళ్తానని చెప్పాడు.
‘‘పైథాన్ అంటే అది కొండచిలువ కదరా... సాప్ అంటే పాము. కొండచిలువ కూడా ఓ రకం పాము. ఈ పాముల్నీ... కొండచిలువల్నీ నేర్చుకునేదేమిట్రా?’’ అడిగాడు తండ్రి.
‘‘అయ్యో నాన్నా... పైథాన్ అంటే అదో కంప్యూటర్ ప్రోగ్రామ్. ఇంకోటి సాప్ కాదు... శ్యాప్... శ్యాప్. అది కూడా ఇంకోరకం ప్రోగ్రామే’’ తలకొట్టుకుంటూ జవాబిచ్చాడు తిరుగేశ్.
అన్నట్టుగానే ఏదో నేర్చుకుని అమెరికాలోని నెవార్క్‌కు వెళ్లి జాబ్‌లో చేరాడు. ఉద్యోగం వెలగబెడుతున్నప్పుడు సెలవుల్లో
సరదాగా దగ్గరే ఉన్న న్యూయార్క్ సిటీ చూడ్డానికి వెళ్లేవాడు. కానీ ఇటీవలే ట్రంపు దెబ్బకు తిరిగొచ్చి హైదరాబాద్‌లో పడ్డాడు.
అదేమిటో... హైదరాబాద్‌కు రానైతే వచ్చాడుగానీ... ఇప్పటికీ తాను ‘న్యూయార్క్’లోనే ఉన్నట్టు ఫీలవుతున్నాడు మన తిరుగేశ్. అందుకే... అక్కడి వీధుల పేర్లు చెబుతూ ఇక్కడి ఆటోల్లో తిరుగుతున్నాడు. మన ఆటోవాలాలు కూడా వాళ్ల నాలెడ్జ్‌కు తగ్గట్లుగా తిరుగేశ్ చెప్పిన పేర్లను తమ ఏరియాలకు అన్వయిస్తూ, అతణ్ణి ఆయా బస్తీల్లో వదిలేస్తూ మీటర్ మీద తమ డబ్బులేవో తాము పుచ్చుకుంటూ నెట్టుకొస్తున్నారు.
ఇదీ... రీ డూప్లికేటివ్ పారామ్నీషియాతో మన తిరుగేశ్
పెక్యులియర్‌గా ప్రవర్తిస్తున్న తీరు తాలూకు కథాకమామీషూ.
ఇంకో కథ
దూరం నుంచి వస్తున్న అన్ననూ వాడి భార్యను దిగులుగా చూస్తున్నాడు శవం.
‘‘ఏరా శివా బాగున్నావా?’’ అంటూ అన్న అడుగుతుంటే
ఆశ్చర్యపోయాడు శవం.
‘ఇంటికి రాగానే తన ఫొటో దగ్గరికి వెళ్లి తమ్ముడూ అంటూ వెక్కివెక్కి ఏడుస్తూ కుప్పకూలిపోవాలి కదా! ఇదేంటీ? బాగున్నావా అంటూ దీర్ఘం తీస్తూ పలకరిస్తున్నారు’ అని మనసులో అనుకుంటూ...
‘‘అన్నయ్యా... బతికున్నప్పుడు నా పేరు శివం. కానీ ఇప్పుడు నేను చచ్చిపోయా కదా. మరణించిన నాటినుంచి నా పేరు శవం.. ప్లీజ్ ఇకపై నువ్వు నన్నలాగే పిలవాలన్నయ్యా’’
అతడన్న మాటలకు అన్నావదినలిద్దరూ లబలబలాడుతూ నోరుకొట్టుకున్నారు వీడేంటీ... ఈ విచిత్రమేమిటీ అని.
దీనికీ ఓ కారణముంది. ఆ కారణం పేరు... ‘కోటార్డ్
డెల్యూషన్’. చిత్రమైన ఈ జబ్బు ఉన్నవారు తాము చనిపోయి ఉన్నామని అనుకుంటూ ఉంటారు.
మరో కథ
‘‘సొక్కమైన వాడిలా ఇందరి కథలు చెబుతున్నావు. నువ్వు అంత చక్కనైనవాడివా?’’ అని మీరడగొచ్చు.
ఈ కథా రచయితనైన నాకు అరుదైన, బరువైన, మారుమూల పదాలు వాడే అలవాటుంది. జ్ఞానినని నన్నందరూ గుర్తించాలని ఓ పిచ్చి తాపత్రయం. అలా వాడేవాళ్లను ‘సెస్క్విపెడలియన్స్’ అంటార్ట.
‘అయినా నీ సంగతి మాకు తెలిదా. నువ్వేం జ్ఞానివిరా’ అంటారా... నిజమండీ బాబూ... అలాంటి పొడవైన, అరుదైన పదాలు పలకాలనే అపరిమితమైన కుతితో ‘ఫ్లాక్సినాక్సినిహిలిపిలికేషన్’ లాంటి వర్డ్స్ వాడుతుంటాను... అది వేస్ట్ అని తెలిసినా! నిజానికి ఆ పదం అర్థం కూడా అదే... ఫ్లాక్సినాక్సినిహిలిపిలిఫికేషన్ అంటే వర్త్‌లెస్ అని మీనింగు. ఇంతకీ ఈ పదాన్ని వాడినవారెవరో తెల్సా... ప్రఖ్యాత రచయిత షేక్స్పియర్.
అన్నట్టు... షేక్స్పియర్ ఇంటిపేరూ... మా ఇంటిపేరూ ఒకటే... ఆయన షేక్ స్పియరూ... నేను షేక్ యాసీన్. అంతే తేడా... మిగతాదంతా సేమ్ టు సేమ్.
అన్నట్టు... నన్ను నేనిలా అనుకునేందుకు కారణమైన నా జ్ఞాన భ్రాంతికి ఉన్న అసలు పేరు
‘గ్రాండియోజ్ డెల్యూజన్’.
నేడు మా దినం. అదేనండీ... మాలాంటి విచిత్రమైన వ్యక్తుల రోజు. అదే ‘పెక్యులియర్ పీపుల్స్ డే’
మా స్పెషల్ రోజు సందర్భంగా నేను మీకు చెబుతున్న స్పెషల్ స్టోరీలివి. – యాసీన్ (‘పెక్యులియర్ పీపుల్స్ డే’ లోకం పోకడలకు భిన్నంగా, చిత్రంగా ప్రవర్తించే వారిది. నిజానికి జబ్బులతో సంబంధం లేదు. కేవలం ఓ సరదా కథనం ఇది)