ఎమ్మెల్యే బోడె అనుచరుల వీరంగం
ఇసుక తక్కువ లోడ్ చేశారన్నందుకు చితకబాదిన వైనం
పెనమలూరు పోలీస్‌స్టేషన్‌లోనే ఘటన
చోద్యం చేసిన పోలీసులు
న్యాయమూర్తికి ఫిర్యాదు చేసిన బాధితుడు
విజయవాడ లీగల్ : పెదపులిపాక ఇసుక రీచ్‌లో ఇసుక తక్కువ లోడ్ చేస్తున్నారని ప్రశ్నించినందుకు పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ అనుచరులు, సీఐ మురళీకృష్ణ, ఇతర సిబ్బంది ఓ వ్యక్తిని చితకబాదిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు బాధితుడు శుక్రవారం విజయవాడ ఒకటో మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కె.శ్రీనివాస్ చక్రవర్తికి శుక్రవారం ఫిర్యాదు చేశాడు. ఎమ్మెల్యే అనుచరులు పెనమలూరు పోలీస్‌స్టేషన్‌లోనే తనను కర్రలు, రాడ్లతో కొడుతుంటే సీఐ పట్టించుకోకుండా చోద్యం చూశారని బాధితుడు పేర్కొన్నాడు. బాధితుడి ఒంటిపై గాయూలు గమనించిన న్యాయమూర్తి అతడ్ని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అనంతరం నివేదిక ఇవ్వమని ఆదేశించారు. వివరాల ప్రకారం.. యనమలకుదురుకు చెందిన బిల్డర్ మంచికలపూడి వెంకటేశ్వరనాథ్ ఇసుక కోసం మీ సేవా కేంద్రంలో రెండు యూనిట్లకు సొమ్ము చెల్లించి బిల్లు తీసుకున్నాడు. అరుుతే, ఇసుక రెండు యూనిట్లకు తక్కువ రావడంతో ఈనెల పదో తేదీ మధ్యాహ్నం పెదపులిపాక వెళ్లి రీచ్ నిర్వాహకులను ప్రశ్నించాడు.
అప్పటికే అక్కడ పహారా కాస్తున్న ఎమ్మెల్యే బోడె ప్రసాద్ అనుచరులు వెంకటేశ్వరనాథ్పై దాడికి దిగారు. ఇదంతా పెనమలూరు సీఐ మురళీకృష్ణ సమక్షంలోనే జరిగింది. బాధితుడిపై దాడి చేయడమే కాకుండా, పెదపులిపాక డ్వాక్రా మహిళల ద్వారా అక్రమ కేసులు బనాయించి స్టేషన్లో ఉంచి కర్రలు, రాడ్లతో దాడికి పాల్పడ్డారు. పదో తేదీ నుంచి వెంకటేశ్వరనాథ్ ఆచూకీ తెలియక శుక్రవారం ఆయన బంధువులు కోర్టులో సెర్చ్ వారెంట్ వేయడానికి సిద్ధమయ్యూరు. సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంకటేశ్వరనాథ్పై సెక్షన్ 353 కింద అరెస్టు చేసి సాయంత్రం కోర్టులో హాజరుపరిచారు. దీంతో బాధితుడు తనపై జరిగిన దాడిని, సీఐ వ్యవహరించిన తీరును న్యాయమూర్తికి చెప్పడంతో ఆయన రాతపూర్వకంగా ఇవ్వమని ఆదేశించారు. సీఐని వివరణ కోరారు. బాధితుడికి ఎక్స్‌రే తీరుుంచగా, వైద్యులు కాలు విరిగినట్లు నిర్ధారించారు.