తల్లిని వేధిస్తున్నాడని తండ్రిని చంపేశాడు
నిజామబాద్: నిత్యం మద్యం తాగి తల్లిని శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడని.. విసుగు చెందిన కుమారుడు తండ్రిని హతమార్చాడు. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం అబ్బాపూర్ (ఎం) గ్రామంలో శనివారం అర్ధరాత్రి దాటాక చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన పెద్దసాయిల్ (52) మద్యానికి బానిసై భార్యను తరచూ వేధింపులకు గురి చేసేవాడు.
ఎంత చెప్పినా తన పద్ధతి మార్చుకోకపోవడంతో విసుగుచెందిన కొడుకు హరీష్ (19) తండ్రిపై కోపం పెంచుకున్నాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి బాగా తాగి వచ్చిన పెద్దసాయిల్ భార్యతో గొడవపడ్డాడు. దీంతో కోపోద్రిక్తుడైన హరీష్ తండ్రి పడుకున్న సమయంలో సుత్తెతో తలమీద మోది హత్య చేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు మృతుడి తమ్ముడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.