వైభవంగా జ్యోతులు
పుట్టపర్తి అర్బన్ : మండలంలోని పెడపల్లి పెద్దతాండాలో కొలువైన మారెమ్మ దేవతకు ఆదివారం గ్రామస్తులు జ్యోతులు మోసి బోనాలు సమర్పించారు. స్థానిక బస్టాండు సమీపంలోని మారెమ్మ ఆలయంలో మూడు రోజులుగా పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాలు నిర్వహించారు. చివరి రోజైన ఆదివారం మహిళలంతా జ్యోతులు, బోనాలతో తండాలోని వీధుల్లో ఊరేగుతూ అమ్మవారి ఆలయంలో సమర్పించారు. ఇటీవల సాయిలీలాబాయి అనే బాలికకు పూనకం వచ్చి ఆలయానికి పూర్వ వైభవం తీసుకు రావాలని, లేకుంటే తండాకు అరిష్టమని చెప్పడంతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించామని గ్రామస్తులు తెలిపారు.
చివరి రోజున జ్యోతులు బోనాలతో పాటు జంతుబలులిచ్చారు. ఈసందర్భంగా ఆలయాన్ని, మారెమ్మ విగ్రహాన్ని ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించి కొబ్బరికాయలు కొట్టారు. కార్యక్రమానికి వేలాది మంది హాజరై పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు తీసుకున్నారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ శ్రీరాంనాయక్, లంబాడీ హక్కుల జిల్లా అధ్యక్షుడు మోహన్‌నాయక్, పెద్ద నాయకుడు బాపూజీనాయక్,యర్రా భాస్కర్, దేనే నాయక్, తిప్పానాయక్, అశ్వర్థనాయక్, బాబు తదితరులు పాల్గొన్నారు.