విద్యుదాఘాతంతో రైతు మృతి
పెద్దఅడిశర్లపల్లి : విద్యుదాఘాతంతో రైతు మృతి చెందిన సంఘటన పీఏపల్లి మండలం అంగడిపేట గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. మృతుడి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. అంగడిపేటకు చెందిన రైతు నీలం వెంకటయ్య (50) వ్యవసాయం చేస్తూ జీవనం గడుపుతున్నాడు. రోజూ వారీ మాదిరిగానే శుక్రవారం తన పొలం వద్దకు వెళ్లాడు. అయితే వెంకటయ్య పొలం మీదుగా 33/11 కేవీ విద్యుత్ వైర్లు కిందికి వేలాడబడి ఉన్నాయి. ఇది గమనించని వెంకటయ్య విద్యుత్ వైర్లకు తగలడంతో విద్యుత్ షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. గమనించిన సమీప రైతులు చూసి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారు వచ్చి ఆసుపత్రికి తరలిద్దామని అనుకుంటుండగా అప్పటికే వెంకటయ్య మృతి చెందాడు. కాగా తన పొలం మీదుగా విద్యుత్ వైర్లు కిందికి వేలాడి ప్రమాదకరంగా ఉండటంతో వెంకటయ్య గతంలో పలుమార్లు విద్యుత్ అధికారులకు విన్నవించినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. అయినప్పటికీ అధికారులు స్పందించలేదని.. వారి నిర్లక్ష్యం కారణంగానే తాము కుటుంబ పెద్దను కోల్పోయామని కుటుంబ సభ్యులు బోరున విలపించారు. కాగా మృతి చెందిన వెంకటయ్యకు భార్య, ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. ముగ్గురు కుమార్తెల్లో పెద్ద కుమార్తె వివాహం చేయగా ఇద్దరు కుమార్తెలకు వివాహానికి ఉన్నారు.