తాగునీటి సమస్య తీర్చండి సారూ..
కలెక్టర్‌కు పెద్దకోట్ల గ్రామస్తుల వినతి
తాడిమర్రి :
‘తాగునీటి కోసం అనేక ఇబ్బందులు పడుతున్నాం.. మా సమస్యను తీర్చండి సారూ’ అంటూ పెద్దకోట్ల గ్రామస్తులు కలెక్టర్ సొలమన్ ఆరోగ్యరాజ్‌తో మొరపెట్టుకున్నారు. చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ వద్ద ఇటీవల నిర్మించిన సత్యసాయి నీటి సరఫరా సంపును ఆదివారం ఆయన పరిశీలించా రు. ఈ విషయం తెలుసుకున్న బీసీ కాలనీవాసులు తమ బాధలు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లేందుకు ఆయన రాకకోసం వేచి ఉన్నారు. కలెక్టర్ రాగానే గ్రామస్తు లు ఆయన వాహనాన్ని అడ్డుకొని తమ బాధలు చెప్పుకొన్నారు.గతంలో తమ కాలనీ గుండా వెళుతున్న పైపులైను కనెక్షన్ తీసివేసి, కొత్త పైపులైన్‌కు అమర్చడంతో సమస్య ఏర్పడిందన్నారు. మూ డు, నాలుగు రోజులకు ఒకసారి నీరు వస్తోందన్నారు. పాత పైపులైన్‌కు కనెక్షన్ పునరుద్ధరించి తాగునీటి సమస్య తీర్చాలని కలెక్టర్‌కు విన్నవించారు. అలాగే కాలనీలో సీసీ రోడ్లు నిర్మించాలని కోరారు. కలెక్టర్ సమాధానమిస్తూ విడుదల చేస్తున్న నీరు శుద్ధి చేసినదని, అందుకే కొత్త పైప్‌లైన్ ద్వారా పరిమితంగా విడుదల చేస్తున్నారన్నారు. నీటి సమస్య రాకుండా చూడాలని ఆర్డబ్ల్యూఎస్ డీఈ రాజ్‌కుమార్‌ను ఆయన ఆదేశించారు. అంతకుముందు కలెక్టర్ మద్దులచెరువు సమీపంలోని నల్లగుట్టపైన, సీబీఆర్ వద్ద రూ.80 కోట్లతో నిర్మించిన వాటర్ సంపులను పరిశీలించారు. శుద్ధి చేసిన నీటిని సరఫరా చేయాలని సిబ్బందిని ఆదేశించారు. అనంతరం మద్దులచెరువు సంపువద్ద మొక్కలను నాటారు.
కార్యక్రమంలో ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ ప్రభాకర్‌రావు, ఎల్అండ్టీ ప్రతినిధులు సెల్వమురగన్, మోహన్‌దాస్ తదితరులు పాల్గొన్నారు.