కొమురవెల్లిలో ఘనంగా ‘పెద్దపట్నం’
కొమురవెల్లి: సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండల కేంద్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మల్లికార్జునస్వామి ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా పెద్దపట్నం, మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం ఘనంగా నిర్వహించారు. శుక్రవారం అర్ధరాత్రి లింగోద్భవ కాలంలో ఆలయ గర్భగుడిలో మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం నిర్వహించారు. కల్యాణ మండపం ఎదుట లింగోద్భవ కాలం అర్ధరాత్రి 1.27 నిమిషాలకు పెద్దపట్నాన్ని మైలపోలుతో ఒగ్గు పూజారులు ప్రారంభించారు.
సుమారు ఐదు గంటల పాటు మల్లన్న నామస్మరణతో ఆ ప్రాంతం మార్మోగింది. మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం ముగిసిన వెంటనే స్వామివారి ఉత్సవ విగ్రహాలను పల్లకి సేవలో ఊరేగించారు. పెద్దపట్నం వద్ద విగ్రహాలను ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు, శివసత్తులు పెద్దపట్నం దాటుతూ మల్లన్నను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. పెద్దపట్నం దాటే సమయంలో భక్తులు ఒక్కసారిగా భారీ గేట్లపై నుంచి పెద్దపట్నం వరకు రావడంతో తోపులాట జరిగింది. దీంతో పలువురు భక్తులకు తీవ్ర గాయాలయ్యాయి.