'అనవసర ఔషధాలకు చెక్ పెట్టండి'
సాక్షి, హైదరాబాద్: పిల్లల ఆరోగ్యానికి చేటు తెచ్చే అనవసర మందులకు అడ్డుకట్ట వేయాలని పెడికాన్-2016 పిలుపునిచ్చింది. పిల్లల వైద్య సంరక్షణే లక్ష్యంగా 15వ ఆసియా-పసిఫిక్ పీడియాట్రిక్ అసోసియేషన్, 53వ పెడికాన్ 2016, 5వ ఆసియా పసిఫిక్ పీడియాట్రిక్ నర్సింగ్ల సంయుక్త ఆధ్వర్యంలో నాలుగు రోజులపాటు జరిగిన అంతర్జాతీయ సదస్సు హైటెక్స్‌లో ఆదివారం ముగిసింది. ఈ వివరాలను నిర్వాహకులు ఒక ప్రకటనలో వెల్లడించారు.
అనవసర మందులకు అడ్డుకట్ట వేయడానికి పాలకులు చేయూతనివ్వాలని సదస్సు విజ్ఞప్తి చేసింది. శిశుమరణాలు అంతకంతకూ పెరిగిపోవడం పట్ల తీవ్ర విచారం వ్యక్తంచేసింది. పిల్లలకు జరిగే హానికర చికిత్స ప్రపంచానికి చేటు అని పేర్కొంది. పిల్లల వైద్య నిపుణులు తమ నైపుణ్యాన్ని మరింత మెరుగుపరుచుకోకపోతే.. భావి పౌరులైన బాలలు అభివృద్ధికి ఆటంకంగా మారగలరని పేర్కొంది. దీన్ని సామాజిక కోణంలో పరిగణించి పాలకులు అడుగులు ముందుకు వేయాల్సిన అవసరం ఉందని సదస్సు అభిప్రాయపడింది. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని పుణికి పుచ్చుకొని పిల్లల ఆరోగ్యాన్ని సంరక్షించే బాధ్యత ప్రతీ ఒక్కరికీ ఉందని సదస్సు అభిప్రాయపడింది.
కేవలం పిల్లల వైద్యులతోపాటు తల్లిదండ్రులు కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నప్పుడే ఈ లక్ష్యాన్ని సాధించగలమని పేర్కొంది. ప్రభుత్వం సూచించిన వ్యాక్సిన్లను తప్పనిసరిగా తీసుకోవాలని సదస్సు కోరింది. ఆలస్యంగానైనా వాటిని తీసుకోవడం మరువొద్దని సూచించింది. హైదరాబాద్ హైటెక్స్‌లో జరిగిన కార్యక్రమంలో వివిధ అంశాల మీద 700 మంది వైద్యులు తమ అనుభవాలను వెల్లడించారు. నాలుగు రోజులపాటు జరిగిన ఈ సదస్సుకు దాదాపు 10 వేల మంది ప్రతినిధులు హాజరుకావడంతో చర్చ ఫలప్రదమైందని సదస్సు స్పష్టంచేసింది.
30 దేశాలకు చెందిన ప్రతినిధులు ఇందులో భాగస్వాములయ్యారు. పిల్లల వైద్య సంరక్షణ మీద పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఈ కార్యక్రమంలో ఆసియా పసిఫిక్ పీడియాట్రిక్ అసోసియేషన్ అధ్యక్షుడు జుల్కిఫ్లీ ఇస్మాయిల్, ఇండియా అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ (ఐఏపీ) అధ్యక్షుడు ప్రమోద్ జోగ్, పెడికాన్ నిర్వాహకులు డాక్టర్ రంగయ్య, డాక్టర్ అజయ్‌కుమార్, డాక్టర్ నిర్మల, డాక్టర్ హిమబిందు సింగ్, డాక్టర్ శ్రీధర్, డాక్టర్ రవికుమార్, జగదీశ్చంద్ర, డాక్టర్ రమేష్ ధంపూరి తదితరులు పాల్గొన్నారు.