నేటి నుంచి పెడికాన్ ఆసియా పసిఫిక్ సదస్సు
♦ శిశు మరణాలు.. భ్రూణ హత్యల నిరోధం...
♦ దేశ, విదేశాల నుంచి10 వేల మంది పిల్లల వైద్యులు, శాస్త్రవేత్తల హాజరు
♦ {పారంభించనున్న వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి
సాక్షి, హైదరాబాద్: శిశు మరణాలు, భ్రూణహత్యలు, చిన్నపిల్లల్లో వ్యాధులు తదితర సమస్యల పరిష్కారం, పిల్లల వైద్య సంరక్షణే లక్ష్యంగా 15వ ఆసియా-పసిఫిక్ పీడియాట్రిక్ అసోసియేషన్, 53వ పెడికాన్ 2016, 5వ ఆసియా పసిఫిక్ పీడియాట్రిక్ నర్సింగ్ల సంయుక్త ఆధ్వర్యంలో గురువారం నుంచి నాలుగు రోజులపాటు హైదరాబాద్ హైటెక్స్‌లో అంతర్జాతీయ సదస్సు జరుగనుంది. బుధవారం ఇక్కడ జరిగిన విలేకరుల సమావేశంలో నిర్వాహక కమిటీ కో-చైర్మన్ డాక్టర్ జగదీశ్చంద్ర, ముఖ్య కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ అజయ్‌కుమార్, నీలోఫర్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సురేశ్‌కుమార్, డాక్టర్ రంగయ్య తదితరులు సదస్సు వివరాలను వెల్లడించారు. ఈ సదస్సుకు దేశ, విదేశాల నుంచి 10 వేలమంది ప్రతినిధులు హాజరవుతున్నారు.
సదస్సులో 22 దేశాల నుంచి రానున్న 100 మంది ప్రసిద్ధ పిల్లల వైద్యనిపుణులు, శాస్త్రవేత్తలు ప్రసంగిస్తారు. యునిసెఫ్, ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధులు హాజరుకానున్నారు. సార్క్ దేశాలు, యూరోపియన్ యూనియన్, అమెరికా తదితర దేశాల నుంచి నిపుణులు హాజరుకానున్నారు. భ్రూణహత్యలకు వ్యతిరేకంగా బాలికలకు అనుకూలంగా ఈ సదస్సు కీలక నిర్ణయం తీసుకోనుంది. శిశుమరణాల తగ్గింపు, భ్రూణ హత్యల నిరోధానికి ఒక కార్యాచరణ ప్రణాళికను ఈ పెడికాన్ సదస్సు రూపొందించనుంది.
సదస్సు ప్రారంభం నేపథ్యంలో హైదరాబాద్‌లో ‘హెల్పింగ్ బేబీస్ సర్వైవ్’ అనే కార్యక్రమాన్ని వారంరోజులుగా నిర్వహిస్తున్నారు. హైటెక్స్‌లోని 12 హాళ్లల్లో నాలుగు రోజులపాటు ఏకధాటిగా సదస్సులు జరుపనున్నారు. 23 ఏళ్ల తర్వాత భారత దేశంలో దీనిపై అంతర్జాతీయస్థాయిలో సదస్సు జరుగుతోంది. పెడికాన్ సదస్సుకు ముందు ఉదయం ఏడు గంటలకు శిల్ప కళావేదిక నుంచి రెండు కిలోమీటర్ల మేరకు హెల్త్‌వాక్ నిర్వహిస్తారు. సాయంత్రం 5.45 గంటలకు హెచ్ఐసీసీలో పెడికాన్ ప్రారంభ కార్యక్రమం ఉంటుంది. రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ సి.లక్ష్మారెడ్డి, హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి పెడికాన్-2016ను ప్రారంభిస్తారని డాక్టర్ జగదీశ్చంద్ర తెలిపారు.