ఒక నిర్ణయం ఆరుగురికి పునరుజ్జీవం
♦ రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన యువకుడు
♦ ఆయన అవయవదానానికి ఒప్పుకున్న భార్య, కుటుంబ సభ్యులు
♦ గుండె గుంటూరుకు, ఊపిరితిత్తులు చెన్నైకు తరలింపు
తాను మరణిస్తూ మరో ఆరుగురి జీవితాల్లో వెలుగును ప్రసాదించాడు పెల్లేటి సుబ్బారెడ్డి. తన అవయవ దానంతో ధన్యుడయ్యాడు. ఆయన అవయవాల దానానికి ఒప్పుకున్న భార్య, కుటుంబ సభ్యులు పలువురికి ఆదర్శంగా నిలిచారు.
నెల్లూరురూరల్ : ప్రకాశం జిల్లా, ఉలవపాడు మండలం కర్రేడు గ్రామానికి చెందిన పెల్లేటి సుబ్బారెడ్డి రైతు కుటుంబంలో జన్మించారు. కరువు పరిస్థితుల్లో పంటలు సక్రమంగా పండకపోవడంతో బతుకు దెరువుకోసం కూలీగా మారాడు. భార్య శివకుమారి, పిల్లలను ఇంటి వద్దే వదిలిపెట్టి జిల్లాలోని ఇందుకూరుపేటకు వలస వచ్చాడు. మద్యం దుకాణంలో రోజువారీ కూలీగా చేరాడు. రెండు వారాలకోసారి ఇంటికెళ్లి భార్య పిల్లలను చూసి వచ్చే వాడు. సుబ్బారెడ్డి కుమార్తె సమీరారెడ్డి మూడో తరగతి, కొడుకు జశ్వంత్‌రెడ్డి రెండోతరగతి చదువుతున్నారు.
ఆదివారం గాంధీజయంతి కావడంతో మద్యం దుకాణానికి సెలవు ఇవ్వడంతో సుబ్బారెడ్డి స్నేహితులతో కలిసి సరదాగా గడిపాడు. ఇందుకూరుపేట మండలం మొత్తల గ్రామం వద్ద ఆదివారం రాత్రి బైక్‌పై వెళ్తున్న సుబ్బారెడ్డి జారీ కింద పడ్డాడు. స్థానికులు సుబ్బారెడ్డిని నారాయణ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. సంతో షంగా సాగుతున్న వారి జీవితంలో రోడ్డు ప్రమాదంలో భర్త తీవ్రంగా గాయపడ్డాడనే పిడుగులాంటి వార్త విని కుటుంబ సభ్యులు కుప్పకూలిపోయారు.
బ్రెయిన్ డెడ్ అని చెప్పిన డాక్టర్లు
సుబ్బారెడ్డిని పరీక్షించిన డాక్టర్లు మెదడులో రక్తం గడ్డకట్టుకుపోయిందని, బ్రెయిన్ డెడ్ అయిందని సుబ్బారెడ్డి కోలుకునే అవకాశం లేదని తేల్చి చెప్పారు. పుట్టెడు దుఖ:ంలో ఉన్న భార్య, కుటుంబ సభ్యులు సుబ్బారెడ్డి ఎలా బతకడని, కనీసం అవయవదానం చేస్తే ఇతరుల జీవితాల్లో బతికే ఉంటాడని ఆలోచన చేశారు. ఆయన అవయవదానానికి అంగీకరించారు. దీంతో నారాయణ ఆస్పత్రివారు విజయవాడలోని జీవన్ దాస్ ట్రస్టును సంప్రదించి అవయవదానానికి ఏర్పాట్లు చేశారు. మంగళవారం మధ్యాహ్నం ఆపరేషన్ చేసి సుబ్బారెడ్డి అవయవాలను వేరు చేశారు.
గుంటూరు ప్రభుత్వ ప్రధాన వైద్యశాలకు గుండెను ప్రత్యేక హెలికాప్టర్లో తరలించారు. లివర్‌ను విజయవాడ మణిపాల్ ఆస్పత్రికి, ఒక కిడ్నీని తిరుపతి రుయా హాస్పిటల్‌కు, ఊపిరితిత్తులను చెన్నై పోతీస్ ఆస్పత్రికి ప్రత్యేక అంబులెన్స్ లో తరలించారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా పోలీసులు గ్రీన్ కారిడార్‌ను ఏర్పాటు చేసి జిల్లా సరిహద్దుల వరకు ఆటంకాలు లేకుండా చూశారు. రెండో కిడ్నీని నారాయణ హాస్పిటల్‌కు, నేత్రా లను నెల్లూరులోని మోడరన్ ఐ ఆసుపత్రికి దానం చేశారు. ఇలా సుబ్బారెడ్డి మరణించి మరో ఆరుగురికి జీవితాన్నిచ్చాడు. అవయవాలను తరలించేటప్పుడు భార్య, బంధుమిత్రులు, సోదరుల ఆర్త నాదాలు మిన్నంటాయి. సుబ్బారెడ్డా... నీవు లేకుండా మేమెలా బతకాలంటూ పెద్ద ఎత్తున వెక్కి, వెక్కి ఏడ్చారు. వీరు రోదనలు అక్కడున్న ప్రతి ఒక్కరి గుండెను కదిలించాయి.
అభినందనీయం
నారాయణ ఆస్పత్రి సీఈవో డాక్టర్ విజయమోహన్ రెడ్డి మాట్లాడుతూ సుబ్బారెడ్డి బ్రెయిన్ డెడ్ అయినట్టు తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు అవవయదానం చేసేందుకు ముందుకు రావడం అభినందనీయమన్నారు. సుబ్బారెడ్డి అవయదానంతో ఆరుగురి జీవితాల్లో వెలుగులు రానున్నాయని తెలిపారు. కుటుంబ సభ్యులకు ఆస్పత్రి పరంగా తాము అండ గా ఉంటామని తెలిపారు. ఈ సమావేశంలో డాక్టర్ శ్రీరాంసతీష్, సురేష్, వరప్రసాద్ పాల్గొన్నారు.
హెలికాప్టర్ సమకూర్చిన కృష్ణపట్నం పోర్టు
నెల్లూరు రూరల్ : అవయవదానంలో గుండెను తరలించేందుకు కృష్ణపట్నం పోర్టు ప్రత్యేక హెలికాప్టర్‌ను సమకూర్చింది. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి బ్రెయిన్ డెడ్ అయిన సుబ్బారెడ్డి అవయవదానం ఆపరేషన్ నారాయణ హాస్పిటల్లో మంగళవారం నిర్వహించారు. గుండెను గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించేందుకు ప్రత్యేక హెలికాప్టర్‌ను ఏర్పాటు చేశారు. అవయవదానానికి తమ వంతు సాయంగా కృష్ణపట్నం పోర్టు సొంత హెలికాప్టర్‌ను పంపించినట్లు పోర్టు పీఆర్ హెడ్ వేణుగోపాల్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఈఓ విజయకుమార్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, మీడియా మేనేజర్ శీనయ్య పాల్గొన్నారు.
ఆశయం బతికి ఉండాలనే ..
అవయవ దాత భార్య శివకుమారి మాట్లాడుతూ తన భర్త సుబ్బారెడ్డి కావలిలో డిగ్రీ చదివేటప్పుడే అవయవదానం చేసేందుకు అంగీకరించినట్లు డైరీలో రాసుకున్నాడన్నారు. అవయవదానం వల్ల మరి కొంతమంది ప్రాణాలను కాపాడవచ్చని బతికి ఉన్నప్పుడే చర్చించేవారని గుర్తు చేసుకున్నారు. ఆయన ఆశయం బతికి ఉండాలనే సంకల్పంతో అవయవదానం చేసినట్లు పేర్కొన్నారు. తమది పేద కుటుంబం అని, కుటుంబ పెద్దను కోల్పోయి కష్టాల్లో ఉన్న తమను ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకున్నారు.