అపరాధ రుసుం రద్దు
మార్చి 31 వరకు చెల్లించిన వారికే అవకాశం
గృహాలు, ప్రభుత్వ కార్యాలయాలకు వర్తింపు
హన్మకొండ : విద్యుత్ వినియోగదారులకు అపరాధ రుసుం నుంచి ప్రభుత్వం మినహా యింపు ఇచ్చాయి. 2016 మార్చి 31వ తేదీ లోపు చెల్లించే వారికి ఈ మినహాయింపు వర్తిస్తుంది. గృహ వినియోగదారులకు, ప్రభుత్వరంగ సంస్థల కార్యాలయాలకు అపరాధ రుసుం నుంచి మినహాయింపు కల్పించారు. 2015 డిసెంబర్ 31వ తేదీ వరకు ఎంత బకా యి ఉన్నదో.. ఆ మొత్తాన్ని ఈ సంవత్సరం మార్చి 31వ తేదీలోపు చెల్లిస్తేనే అపరాధ రుసుం నుంచి మినహాయింపు కలుగుతుంది. ప్రస్తుతమున్న బకాయిలు చూస్తే.. దాదాపు మూడొంతుల బకాయిల్లో రెండు వంతులు అసలు ఛార్జీ కాగా.. ఒక వంతు అపరాధ రుసుం ఉంది. అపరాధ రుసుం రద్దుతో గృహ వినియోగదారులకు, ప్రభుత్వ కార్యాలయాలకు ఎంతో మేలు జరుగనుంది.
మొండి బకాయిలు వసూలు చేసుకోవడానికి విద్యుత్ పంపిణీ సంస్థలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. 2015 డిసెంబర్ 31వ తేదీ వరకు జిల్లాలో గృహ వినియోగదారుల బకాయిలు అపరాధ రుసుం కలుపుకుని రూ.104 కోట్లు ఉన్నాయి. ఇందులో విద్యుత్ వినియోగించుకున్నందుకు చెల్లించాల్సిన మొత్తం రూ.73 కోట్లు కాగా.. ఈ బకాయిలకు రూ.31 కోట్లు అపరాధ రుసుము ఎన్పీడీసీఎల్ విధించింది. మార్చి 31లోపు రూ.73 కోట్లు చెల్లిస్తే రూ.31 కోట్ల అపరాధ రుసుం రద్దు కానుంది. ప్రభుత్వరంగ సంస్థ కార్యాలయాలకు సంబంధించిన బకాయిలు రూ.105 కోట్లు కాగా.. ఇందులో విద్యుత్ విని యోగించుకున్నందుకు చార్జీ రూ.79 కోట్లు. అపరాధ రుసుము రూ.26 కోట్లు ఉంది.