'నమ్మించి.. గొంతుకోశాడు..'
విజయవాడ: పొదుపు సంఘాలను ముంచడమే పనిగా పెట్టుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు.. మహిళాశక్తి అంటే ఏంటో నిరూపిస్తామని ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెన్మెత్స దుర్గాభవాని వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో మహిళలకు ఇచ్చిన డ్వాక్రా రుణమాఫీ వాగ్దానాన్ని వెంటనే అమలుచేయాలని, మద్యాన్ని నియంత్రించాలని డిమాండ్ చేస్తూ వామపక్ష మహిళా సంఘాల రాష్ట్ర సదస్సు శుక్రవారం విజయవాడలో జరిగింది.
ఈ సదస్సులో ఆమె మాట్లాడుతూ.. బెల్టుషాపులను ఎత్తివేస్తామని చెప్పిన బాబు.. మద్యం అమ్మకాలను అంచెలంచెలుగా పెంచుతూ మహిళలను నమ్మించి గొంతుకోశారని విమర్శించారు. మహిళా సాధికారత పేరుతో డ్వాక్రా మహిళల శ్రమశక్తిని దోపిడీ చేస్తున్నారన్నారు. అవినీతిలో భాగస్వాములను చేసుకునేందుకు ఇసుక రీచ్లు, మద్యం దుకాణాల టెండర్లకు మహిళలను ఆహ్వానించిన చంద్రబాబును నిలదీయాల్సిన అవసరం ఉందని చెప్పారు.
ఐద్వా నాయకురాలు వి.ప్రభావతి అధ్యక్షత వహించిన ఈ సదస్సులో పీవోడబ్ల్యూ అధ్యక్షురాలు ఎన్.విష్ణు, అఖిల భారత ప్రగతిశీల మహిళా సంఘం అధ్యక్షురాలు టి.అరుణ, అఖిల భారత మహిళా సాంస్కృతిక సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు జి.లలిత ప్రసంగించారు. మహిళా సంఘాలకు మద్దతుగా సీపీఎం రాష్ట కార్యదర్శి పి.మధు, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎం.నాగేశ్వరరావు, ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర కార్యదర్శి పి.వి.సుందరరాజు, సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ర్ట కార్యదర్శి చిట్టిపాటి వెంకటేశ్వర్లు, సీపీఐ (ఎంఎల్) లిబరేషన్ రాష్ర్ట కార్యదర్శి ఎన్.మూర్తి పాల్గొన్నారు.