‘పెన్నమ్మ’కు పంచహారతులు
నెల్లూరు(బృందావనం):
శ్రావణ పౌర్ణమి, కృష్ణ పుష్కరాలను పురస్కరించుకుని పవిత్ర పినాకిని నదికి పంచహారతులు(మహాహారతి) కార్యక్రమాన్ని గురువారం రాత్రి భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. స్థానిక రంగనాయకులపేటలోని శ్రీదేవి, భూదేవి సమేత శ్రీతల్పగిరి రంగనాథస్వామి వారి ఆలయ ప్రాంగణంలో శ్రీతల్పగిరి క్షేత్రంలో ఉత్తర వాహినిగా ప్రవహిస్తున్న పెన్నమ్మకు ఆలయ ప్రధాన అర్చకులు కిడాంబి జగన్నాధాచార్యులు ఆధ్వర్యంలో వేదపండితులు, అర్చకులు శాస్త్రోక్తంగా కర్పూరహారతి, ఏకహారతి, కుంభహారతి, ఘటహారతి, పంచహారతిని భక్తిప్రపత్తులతో నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ముంగమూరు శ్రీధరకృష్ణారెడ్డి, శ్రీతల్పగిరి రంగనాథస్వామి దేవస్థానం పాలకమండలి చైర్మన్ మంచికంటి సుధాకర్‌రావు, పాలకమండలిసభ్యులు, భక్తులు విశేషంగా పాల్గొన్నారు. రంగనాథుడి నామస్మరణతో పెన్నానది తీరం పులకించింది. ఎన్నో ఏళ్లక్రితం నిలిచిపోయిన పినాకినినది మహా హారతి కార్యక్రమాన్ని దేవస్థానం నూతన పాలక మండలి చేపట్టడం సర్వజన శుభప్రదమన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హయాంలో నదుల అనుసంధానంతో పవిత్ర గోదావరి, కృష్ణా, పెన్నానదుల సంగమం జరుగుతుందన్నారు. పాలకమండలి చైర్మన్ మంచికంటి సుధాకర్‌రావు మాట్లాడుతూ పవిత్ర శ్రావణ పౌర్ణమినాడు కృష్ణాపుష్కరాల సమయంలో కృష్ణానదీజలాలు పెన్నానది జలాలతో కలవడం అదే సమయంలో పెన్నమ్మకు తమ ఆలయ అర్చకుల సూచనలు, సలహాల మేర కు మహాహారతి ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా అన్నమయ్య ప్రాజెక్ట్ కళాకారుడు గుండాల గురవయ్య ఆలపించిన అన్నమాచార్య కీర్తనలు అలరించాయి. గుండాల గురవయ్యను మాజీ ఎమ్మెల్యే ముంగమూరు శ్రీధరకృష్ణారెడ్డి, ఆలయ చైర్మన్ మంచికంటి సుధాకర్, పాలకమండలి సభ్యులు సత్కరించారు.